ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా పరిచయమైన మెగాహీరో పంజా వైష్ణవ్ తేజ్. డెబ్యూ మూవీతో మంచిపేరు తెచ్చుకున్న వైష్ణవ్.. రెండో సినిమా కొండాపొలంతో నిరాశపరిచాడు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా ‘రంగ రంగ వైభవంగా’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించారు. ఇక దర్శకుడు గిరీశాయ రూపొందించిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. మరి ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ లతో మంచి హైప్ క్రియేట్ చేసిన ‘రంగరంగ వైభవంగా’ మూవీ.. ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం!
ఈ సినిమా కథ పక్కపక్కనే ఉండే రెండు కుటుంబాల నేపథ్యంలో సాగుతుంది. రిషి(వైష్ణవ్ తేజ్), రాధా(కేతికా శర్మ) ఇద్దరూ ఒకేసారి ఒకేరోజు పుడతారు. వీళ్ల ఫాదర్స్(నరేష్, ప్రభు) చిన్నప్పటి నుండి ప్రాణస్నేహితులు. పెరిగే కొద్దీ రిషి, రాధా ఇద్దరిలో ఒకరిపై ఒకరికి విడదీయలేనంత ఇష్టం, ప్రేమ ఏర్పడతాయి. కానీ..స్కూల్ లో జరిగిన ఓ గొడవ వల్ల ఇద్దరి మధ్య ఇగోలు పెరిగిపోయి, పదేళ్లు మాట్లాడుకోరు. కట్ చేస్తే.. ఓ ఇన్సిడెంట్ వల్ల ఇగోస్ పక్కనపెట్టి ఇద్దరూ ఒక్కటవుతారు. ఇంతలోనే ఓ పెద్ద గొడవ వల్ల రిషి, రాధా ఫ్యామిలీస్ విడిపోతాయి. మరి రిషి, రాధాలను పదేళ్లు దూరంచేసిన ఆ ఇగో ఏంటి? ఇగో పక్కనపెట్టి రిషి, రాధా ఎలా కలిశారు? చివరికి వీరిద్దరి ఫ్యామిలీస్ ఎలా ఒక్కటయ్యాయి? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
తెలుగులో రొమాంటిక్ లవ్ నేపథ్యంతో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తెరమీదకు వచ్చాయి. అందులో ఎన్నో గొప్పవి అనిపించిన సినిమాలు ఉన్నాయి.. అలాగే రొటీన్ అనిపించిన కథలు కూడా వచ్చాయి. అయితే.. ఈ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ కూడా రొటీన్ జానర్ కే చెందుతుందని చెప్పవచ్చు. చిన్నప్పటి నుండే ఇష్టపడి, ప్రేమించుకున్న హీరో హీరోయిన్స్ మధ్య ఇగో క్లాషెస్ థీమ్ ని.. గతంలో మనం ‘100% లవ్’, ఖుషీ, బాలు, రామరామ కృష్ణకృష్ణ లాంటి సినిమాలలో చూశాం. అవన్నీ మంచి హిట్స్.. అలాగని ఈ సినిమా ఆ లిస్ట్ లో చేరుతుందని చెప్పలేం. ఎందుకంటే.. ఈ సినిమా ఆ జానర్ లో మాత్రమే తెరకెక్కింది.. అంతకుమించి కొత్త స్టోరీ, స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఏమిలేవు.
ఇక సినిమాలోకి వెళ్తే.. ‘రంగ రంగ వైభవంగా’ మూవీ స్టోరీని దాదాపు ట్రైలర్ చూసినవారందరికీ అప్పుడే అర్థమై ఉంటుంది. సినిమా కూడా అలాగే మొదలైంది. హీరోహీరోయిన్ ఫాదర్స్(నరేష్, ప్రభు)ఇద్దరూ ప్రాణస్నేహితులు.. ఈ రెండు ఫ్యామిలీస్ లో ఒకేరోజు, ఒకే టైంలో హీరో రిషి, హీరోయిన్ రాధా పుడతారు. అలా చిన్నప్పటి నుండి ఇద్దరి మధ్య ఇష్టం.. లవ్ ని చూపిస్తూ క్యారెక్టర్స్ ని పరిచయం చేశారు. ఇక స్కూల్ లో ఇద్దరి మధ్య ఇగో క్లాషెస్ వచ్చి.. ముందుగా ఎవరు మాట్లాడతారు? అనే పాయింట్ తో సినిమా కథ మొదలవుతుంది. పక్కపక్కనే ఇల్లు, ఫ్యామిలీస్ చూపించిన దర్శకుడు.. హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ బాగానే రాసుకున్నాడు.
ఇద్దరూ మాట్లాడుకోరు, కానీ ఇండైరెక్ట్ గా ఒకరిపై ఒకరి ఇష్టాలను, ప్రేమను చూపుకుంటూ ఉంటారు. మరోవైపు రెండు ఫ్యామిలీస్ కూడా ఇద్దరినీ సపోర్ట్ చేయడం.. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా సరదా సన్నివేశాలతో నడిపించారు. అయితే.. ఇవన్నీ గతంలోనే చూసేశాం కదా.. కొత్తగా ఏమైనా ఉంటే చూపించండి అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంతలోనే ఓ ఇన్సిడెంట్ వలన ఇద్దరి మధ్య మాటలు.. టచింగ్స్, కిస్సింగ్స్ జరిగి ఇంటర్వెల్ పడుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్, లవ్ అన్నీ పెరిగిపోయి.. పెళ్లి చేసుకుంటారేమో అనే టైమ్ కి.. ఓ ట్విస్టు పెట్టాడు దర్శకుడు. ఆ ట్విస్టు కూడా లాజిక్ లేకుండా చాలా సిల్లీగా అనిపిస్తుంది.. దీంతో రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవ జరిగి విడిపోతాయి.
అక్కడినుండి మళ్లీ మామూలే.. విడిపోయిన ఫాదర్స్ ఫ్రెండ్ షిప్.. ఫ్యామిలీస్ ని హీరోహీరోయిన్ ఎలా కలిపారు అనే దాని చుట్టూ కథ సాగుతుంది. ఇక్కడే మనకు కొంచం ఇష్టం కొంచం కష్టం, బొమ్మరిల్లు తాలూకు సన్నివేశాలు, హీరో హీరోయిన్స్ వేసే ప్లాన్స్ గుర్తుచేస్తాయి. ఎలాగో క్లైమాక్స లో హీరో హీరోయిన్ ఒక్కటి అవ్వాలి కదా.. దానికోసం రెండు ఫ్యామిలీస్ కలవడం వెనుక హీరోనే ఉన్నాడని ఒక్కో పాయింట్ రివీల్ చేయడం చాలా బోరింగ్ అనిపిస్తుంది. మొత్తానికి అలా ఫస్టాఫ్ లో ఇగోస్, లవ్ ట్రాక్.. సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ విత్ రొటీన్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అన్నట్లుగా నడిచింది ఈ సినిమా. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ.. అరెరే ఇవన్నీ ఇదివరకు చూసేశాం కదా అనిపిస్తుంది.. అలాగే ఏమాత్రం ప్రేక్షకులలో థ్రిల్, ఊపు కలిగించలేకపోవడం గమనార్హం.
ఇక సినిమాలో రిషి, రాధా క్యారెక్టర్స్ లో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ ఆకట్టుకున్నారు. వారి మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ బాగుంది. అయితే.. దర్శకుడు పాత సీసాలో కొత్త సరుకు నింపి చూపించే ప్రయత్నం చేశాడని చెప్పాలి. ఫాదర్స్ గా నరేష్, ప్రభు పర్వాలేదు అనిపించారు. అలాగే హీరోయిన్ బ్రదర్ గా నవీన్ చంద్రను ఇలాంటి క్యారెక్టర్స్ లో ఇదివరకే చూశాం. సినిమాలో ఏ ఒక్క పాత్ర కూడా బలంగా గుర్తుండిపోయేలా రాసుకోలేకపోయాడు దర్శకుడు. క్యారెక్టర్స్ తో పాటు సీన్స్, స్క్రీన్ ప్లే.. రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయంటే ఉన్నాయి.. అంతేగాని ఎక్కడ ఒక్క సీన్ కూడా గుండెని తడి చేయలేకపోయాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించాయి.
కథాకథనాలలో దమ్ము లేనప్పుడు బ్యాక్ మ్యూజిక్ ఎంత కొట్టినా ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వడం కష్టమే. సినిమా మొదలైన 20 నిమిషాల్లోనే నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రేక్షకులు అంచనా వేయగలరు. ప్రెడక్టబుల్ స్క్రీన్ ప్లే వలన ఆడియన్స్ లో ఏమాత్రం ఎక్సయట్ మెంట్ కనిపించలేదు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే.. దర్శకుడు గిరీశాయ తమిళంలో అర్జున్ రెడ్డి మూవీ రీమేక్ తో డెబ్యూ చేశాడు. అంటే.. ఇదే తనకు ఫస్ట్ ఓన్ మూవీ అని చెప్పవచ్చు. కానీ.. ఎప్పుడో పాతబడిన కాన్సెప్ట్ నే కొత్తవాళ్లతో రిపీట్ చేసే ప్రయత్నం చేయడం.. ఈ సినిమా ఫలితాన్ని ఎలా నిర్ణయిస్తుందో చూడాలి.
ప్లస్ లు:
లీడ్ పెయిర్ కెమిస్ట్రీ
సాంగ్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ లు:
కథాకథనాలు
ఎమోషన్స్
రొటీన్ సీన్స్
చివరిమాట:
వైభవం లోపించిన రొటీన్ లవ్ స్టోరీ!