సత్యదేవ్ అంటే మినిమమ్ గ్యారంటీ హిట్ హీరో. సత్యదేవ్ ఎంచుకునే కంటెంట్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ విషయం అతని గ్రాఫ్ చూస్తేనే తెలుస్తుంది. బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, తిమ్మరుసు, గాడ్సే వంటి గ్రిప్పింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించిన సత్యదేవ్.. తాజాగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలయ్యింది. 2020లో కన్నడలో పెద్ద హిట్ గా నిలిచిన లవ్ మాక్ టైల్ సినిమాకి రీమేక్ గా వచ్చింది ఈ సినిమా. మరి ఇప్పటి వరకూ సత్యదేవ్ చేస్తున్న జోనర్స్ కి భిన్నంగా.. లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం.
సత్యదేవ్ (సత్యదేవ్) ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. కాలేజ్ లో ధనవంతురాలి కూతురు అమ్ము అలియాస్ అమృతతో (కావ్యా శెట్టి) పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం సత్యదేవ్, అమ్ముల ప్రేమకు దారి తీస్తుంది. ఇలా వీరి ప్రేమ కొనసాగుతుండగా.. సత్యదేవ్ కి బెంగళూరులోని ఒక కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అయితే సత్యదేవ్ జీతం తక్కువ కావడంతో.. పెళ్ళైతే ఆ జీతంతో ఇద్దరూ కలిసి బతకడం కష్టమని అమ్ము తల్లి అంటుంది. దీంతో అమ్ము.. సత్యదేవ్ కి బ్రేకప్ చెప్పేస్తుంది. లవ్ ఫెయిల్ అయిన బాధలో ఉన్న సత్యదేవ్ కి లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. సత్యదేవ్ లైఫ్ లోకి నిధి (తమన్నా) వస్తుంది. గతం తెలిసి కూడా సత్యదేవ్ ను లవ్ చేస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. తీరా పెళ్లి చేసుకున్నాక బ్రేకప్ చెప్పిన అమ్ము మళ్ళీ సత్యదేవ్ కి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు సత్యదేవ్ తీసుకున్న నిర్ణయం ఏంటి? నిధిని కాదని సత్యదేవ్ అమ్ము కోసం ఆలోచిస్తాడా? లేదా ప్రాణంగా ప్రేమించి నిధి కోసం ఆలోచిస్తాడా? లైఫ్ ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ని వినియోగించుకుంటాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కో స్టేజ్ లో ఒక్కో లవ్ స్టోరీ ఉంటుంది. స్కూల్, కాలేజ్, కెరీర్ ఈ మూడు స్టేజెస్ లో ఏదో ఒక స్టేజ్ లో ప్రేమలో పడతారు. అయితే మూడు స్టేజెస్ లో ప్రేమలో పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ మూడు స్టేజెస్ లో జరిగిన లవ్ స్టోరీస్ ని తలచుకుంటే మంచి అనుభూతి కలుగుతుంది. లవ్ ఫెయిల్ అయ్యి.. వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత మాజీ లవర్స్ ఒకసారి జీవితాల్లోకి వస్తే కలిగే అనుభూతి వర్ణించలేనిది. పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అనుభూతిని పొందే పాత్రలో సత్యదేవ్ చాలా నటించారు. రియల్ లైఫ్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. నిజానికి ఇది 2020లో వచ్చిన కన్నడ సినిమా లవ్ మోక్ టైల్ సినిమాకి రీమేక్ అయినప్పటికీ మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు.
ఒకసారి వద్దని వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి మళ్ళీ వస్తే కలిగే అనుభూతిని, స్కూల్లో ఉన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి మరలా వస్తే కలిగే అనుభూతిని సత్యదేవ్ చాలా బాగా ప్రదర్శించారు. ఇక నిధి పాత్రలో తమన్నా, దివ్య పాత్రలో మేఘా ఆకాష్, అమ్ము పాత్రలో కావ్య శెట్టి, సత్యదేవ్ స్నేహితుడిగా ప్రశాంత్ పాత్రలో ప్రియదర్శి చాలా బాగా నటించారు. అయితే అప్పటి వరకూ సత్యదేవ్ ని విభిన్నమైన కథల్లో, సీరియస్ పాత్రల్లో చూసినవారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇది రెండేళ్ల క్రితం సినిమా. ఈ రెండేళ్లలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది.
అప్పుడు రిలీజ్ అయి ఉంటే ఆదరణ ఎక్కువగా ఉండేది. వాయిదాలు పడుతూ రావడం వల్ల సినిమా ఆలస్యంగా విడుదలయ్యింది. 2020లో సినిమా అంటే ఎంత పాతదో అర్ధం చేసుకోవచ్చు. సినిమాపై జనానికి ఇంట్రస్ట్ లేకపోవడానికి ఇదొక కారణం కూడా కావచ్చు. మరోవైపు దీని మాతృక లవ్ మోక్ టైల్ ఓటీటీలో చాలా మంది చూసేశారు. ఈ రకంగా సినిమాకి ఆడియన్స్ చూసే అవకాశం లేకపోవచ్చు. ఇక సాంకేతిక పనితీరు విషయానికొస్తే.. నిర్మాణ విలువలు బాగున్నాయి. సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ, కాలభైరవ సంగీతం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది.