వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులను కామెడీ సినిమాలెప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఇదివరకు కామెడీ సినిమాలంటే కామెడీ యాంగిల్ లోనే చూసేవారు జనాలు. కానీ.. ఇప్పుడు ఓటిటిలు వచ్చాక జనాల అభిరుచులు, సినిమాలను చూసే విధానం మారిపోయింది. కామెడీ సినిమాలైనా, వేరే సినిమాలైనా కంటెంట్ ప్రధానంగా చూస్తున్నారు. అందుకే ఓన్లీ కామెడీ కాకుండా మంచి స్టోరీ లైన్ తో వస్తే ఏ సినిమాలైనా ఆడతాయి. కాగా.. కోలీవుడ్ డైరెక్టర్ రత్నకుమార్ బ్లాక్ కామెడీ నేపథ్యంలో ‘గులు గులు’ అనే సినిమా తెరకెక్కించాడు. జూలైలో థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా.. తాజాగా సన్ నెక్స్ట్(SUNNXT) ఓటిటిలో విడుదలైంది. స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
చెన్నైలో నివసించే గులు గులు అలియాస్ గూగుల్(సంతానం), ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తుంటాడు. అలా ఎవరికిపడితే వారికి హెల్ప్ చేస్తూ లేనిపోని ఇబ్బందులలో పడుతుంటాడు. ఈ క్రమంలో ప్రముఖ మద్యం వ్యాపారి కూతురు మటిల్డా(అతుల్య చంద్ర) ఫ్రాన్స్ నుండి ఇండియాలో అడుగు పెడుతుంది. అయితే.. ఎప్పటినుండో మటిల్డాని చంపాలని సవతి తల్లి కొడుకులు డేవిడ్(ప్రదీప్ రావత్), రాబర్ట్(బిపిన్ కుమార్) అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. కట్ చేస్తే.. తండ్రి తనను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలని ప్రముఖ సైంటిస్ట్ కొడుకు విదేశాల నుండి ఇండియాకి కిడ్నాప్ ప్లాన్ చేస్తాడు. ఇలాంటి తరుణంలో మటిల్డాకి బదులుగా సైంటిస్ట్ కొడుకును గుర్తుతెలియని బృందం కిడ్నాప్ చేస్తుంది. అతన్ని కాపాడటానికి గులు గులుని ఆశ్రయిస్తారు ఫ్రెండ్స్. మరి కిడ్నాప్ అయిన వ్యక్తిని రక్షించేందుకు గులు గులు ఏం చేశాడు? మటిల్డాకి, కిడ్నాప్ కి లింకేంటీ? చివరికి ఏమైంది? అనేది మూవీలో చూడాల్సిందే.
సాధారణంగా డార్క్ కామెడీ సినిమాలలో లవ్, సెంటిమెంట్, సీరియస్ డ్రామా లాంటివి ఏం లేకుండా కేవలం ప్రేక్షకులను నవ్వించడానికి లాజిక్స్ లేని కామెడీతో సాగుతుంటాయి. ఈ తరహా కామెడీ సినిమాలలో గులు గులు సినిమా కూడా చేరుతుందని చెప్పాలి. లాజిక్స్ లేకుండా కామెడీ ఉన్నప్పటికీ, డైరెక్టర్ రత్నకుమార్ సినిమాలో కథాకథనాలను ఎలా నడిపించాడు? అనేది పాయింట్. కాగా.. ఈ సినిమాలో కథని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. మరి స్క్రీన్ ప్లే పరంగా కథకు న్యాయం జరిగిందా లేదా అనేది చూద్దాం. ఈ సినిమా అంతా గులు గులు(సంతానం) క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది.
ఎన్నో ప్రాంతాలు తిరిగిన గులు గులు.. లైఫ్ లో అన్ని విషయాలు తెలుసుకొని అపారమైన జీవితానుభవాలు చూసాడు. గులు గులు దాదాపు 13 భాషలు మాట్లాడగలడు.. ఎవరు హెల్ప్ అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. అందుకే గులు గులు పేరును గూగుల్ నుండి సరిగ్గా తెచ్చిపెట్టాడు డైరెక్టర్. కానీ.. గులు గులు క్యారెక్టర్ లో అన్నిసార్లు పాజిటివ్ లే కాకుండా మైనస్ లు కూడా పెట్టారు. అందుకే స్క్రీన్ ప్లేలో లాజిక్స్ లేకుండా.. హెల్ప్ చేసి ఇబ్బందులు ఎదుర్కోవడం.. లేని గందరగోళాన్ని సృష్టించడం చూడవచ్చు. ఈ గులు గులు క్యారెక్టర్ ద్వారానే సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఒక్కొక్కటీగా పరిచయం అవుతుంటాయి. మరి ఆ క్యారెక్టర్స్ అన్నింటితో గులు గులుకి లింక్ ఎలా పెట్టారు అనేది ఇంటరెస్టింగ్ పాయింట్.
ఇక తన తండ్రిని చూసేందుకు ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన మటిల్డా క్యారెక్టర్ ఎంట్రీ బాగా ప్లాన్ చేసుకున్నారు. అదే టైంలో ఆమెను చంపేందుకు చూస్తున్న సవతి సోదరుల క్యారెక్టర్స్ కథలో ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. మరోవైపు తండ్రి ప్రేమకు పరీక్ష పెడుతూ కిడ్నాప్ కి గురైన సైంటిస్ట్ కొడుకు క్యారెక్టర్.. అతన్ని కాపాడుకునేందుకు ఫ్రెండ్స్ గులు గులు సహాయం కోరడం.. దీంతో ఒకరి బదులు ఒకరు కిడ్నాప్ అయిన ఇంటరెస్టింగ్ టైంలో గులు గులు ఏం చేశాడు? అనే అంశాలు సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇక్కడివరకు సన్నివేశాలు సరదా సరదాగా సాగిపోతుంటాయి. అయితే.. ఇన్ని చిక్కుల మధ్య క్లైమాక్స్ ఎలా ప్లాన్ చేశాడో తెలుసుకోవాలనే ఆసక్తిని ఆడియెన్స్ లో కలిగించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
రైటింగ్ పరంగా గులు గులు ఆసక్తికరంగా ఉంటుంది. కథలో అన్ని క్యారెక్టర్స్ కి ప్రత్యేకత ఉంటుంది. పైగా ఆ క్యారెక్టర్స్ చుట్టూనే కథ తిరుగుతూ ఉండటంతో.. ఇలా కథను బాగానే అల్లుకున్నాడు. అయితే.. సినిమా అంతా ఇలాగే సాగుతుండటంతో చూసేవారికి ప్లస్, మైనస్ రెండూ అనిపిస్తాయి. కాకపోతే దర్శకుడు అనుకున్న ఆలోచనను తెరపై ఆవిష్కరించాడు. అయితే.. డార్క్ కామెడీ కాబట్టి.. సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది ప్రధానాంశం. కొన్నిచోట్ల కామెడీ ఫ్లాట్ గా సాగినట్లు అనిపిస్తుంది. కానీ.. ఎమోషన్స్ కూడా మెయింటైన్ చేసే ప్రయత్నం చేశాడు. పూర్తిగా ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయినట్లుగా అనిపించవచ్చు.
ఇక టెక్నికల్ గా సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు బలాలు. సెకండాఫ్‌లో తక్కువ సన్నివేశాలు ఉన్నప్పటికీ సినిమాను మరో స్థాయికి ఎలివేట్ చేశాడు. సంచారిగా సంతానం నటన బాగుంది. గులు గులు క్యారెక్టర్ తాజాగా ఉంటుంది. వీధిలో ఒక లేడీకి హెల్ప్ చేసి, ఆ తర్వాత తనకు తానుగా ఇబ్బందిపడే సన్నివేశం బాగా రాసారు. భయపెట్టే విలన్ గా ప్రదీప్ రావత్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంది. జార్జ్ మేరియన్, హీరోయిన్ అతుల్య చంద్రల నటన కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.