Indian Couple: ఒకప్పటి పెళ్లిళ్లకు.. నేడు సమాజంలో జరుగుతున్న పెళ్లిళ్లకు చాలా మార్పు కనిపిస్తోంది. ఒకనాటి పెళ్లిళ్లు ‘‘ ఆకాశం దిగి వచ్చి… మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా… జరగాలి పెళ్ళంటే మరీ ’’ అన్నట్లుగా ఉండేవి. హంగు ఆర్భాటాలతో పాటు బంధాలకు, ప్రేమలకు పెద్ద పీఠ ఉండేది. నేటి పెళ్లిళ్లు తూతూ మంత్రంగా అయిపోతున్నాయి. కేవలం హంగు, ఆర్భాటం కోసం మాత్రమే జరుగుతున్నాయి. ఇది చాలదు అన్నట్లు ఓ కొత్త పైత్యం పట్టుకుంది జనాలకు. ప్రీ వెడ్డింగ్.. పోస్ట్ వెడ్డింగ్ షూట్‌ల పేరిట తమ పైత్యానికి పని చెబుతున్నారు.
పాపులారిటీ కోసం వెడ్డింగ్ షూట్‌ల పేరిట పిచ్చి పనులు చేస్తున్నారు. నీళ్లలో, నేలపై, ఆకాశంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ వెడ్డింగ్ షూట్ నిర్వహిస్తున్నారు. నదుల్లో వెడ్డింగ్ షూట్ చేస్తూ కొందరు చనిపోయారు కూడా. అయితే, తాజాగా, ఓ వింత వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో నూతన వధూవరులు ఏకంగా శ్మశానంలో వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. అంతటితో ఆగకుండా అక్కడ ఐదు అడుగుల సమాధి గొయ్యి తీయించుకున్నారు. అందులో చనిపోయిన శవాల్లాగా పడుకుని ఫొటో దిగారు. ఆ నూతన వధూవరులు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు? ఈ ఫొటో షూట్ ఎప్పుడు జరిగింది?
అన్న విషయాలు అయితే తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇదేం ఖర్మరా బాబు.. పాపులారిటీ కోసం ఇంత బరితెగించాలా?’’.. ‘‘ పెళ్లయిన తర్వాత ఎలాగూ అక్కడి రావాల్సిందేనని డిసైడ్ అయినట్లు ఉన్నారు. అందుకే అలా సమాధిలో పడుకున్నారు’’.. ‘‘పిచ్చి పీక్స్ అంటే ఇదే’’ .. ‘‘పెళ్లి అయిన వాళ్లు చచ్చి సమాధిలో ఉన్న వాళ్లు ఒక్కటే అని చెప్పటానికి సింబాలిక్‌గా అలా చేశారేమో’’.. ‘‘ వెడ్డింగ్ షూట్ అంటే కలకాలం గుర్తుండి పోయేలా ఉండాలి. కానీ, ఇలా ఫొటోలు దిగి.. వాటిని చూసినప్పుడల్లా.. ఎందుకు అలా చేశామురా బాబు అనిపించకూడదు. పాపం.. సమాధిలో కొత్త జంట!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.