Viral News: కుక్కలు మనుషులకు ప్రియమైన నేస్తాలు. కొంతమంది కుక్కలను ప్రాణంగా భావిస్తారు. ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటుంటారు. మనుషుల్లాగే వాటికి ఎలాంటి చిన్న అనారోగ్యం కలిగినా వెంటనే ఆసుపత్రికి తీసుకెళుతుంటారు. కొద్దిమంది మాత్రమే వాటికి అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటారు. అలా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను పళ్ల క్లీనింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చివరకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. కుక్క పళ్లను క్లీనింగ్ కోసం లక్షలు ఖర్చు చేసిన సదరు యజమాని ఆ సంఘటన గురించి చెబుతూ.. ‘‘ నా కుక్క పళ్లను క్లీన్ చేయించటానికి నేను దాన్ని వెట్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను.
దాని వయసు 12 సంవత్సరాలు. డాక్టర్ దాని పళ్లు క్లీన్ చేయటానికి ఇంజెక్షన్ వేశాడు. అప్పుడు దాని రంగు మారింది. వెంటనే డాక్టర్లు క్లీనింగ్ ఆపేశారు. తర్వాత కొన్ని టెస్టులు చేశారు. నా కుక్కకు క్యాన్సర్ ఉందేమోనన్న అనుమానం వారికి కలిగింది. కొన్ని పళ్లు పీకారు. లోపల ఉన్న కణితిని తీసేశారు. కణితిని టెస్టులకోసం పంపారు. అలా మొత్తం 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మా తల్లిదండ్రులు అయితే కుక్కల్ని వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లరు.
ఎందుకంటే వారంత డబ్బులు పెట్టుకోలేరు. ఇక, మా అత్తామామల ఇంట్లోనే ఓ వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు కాబట్టి వారికి పర్వాలేదు’’ అని అన్నాడు. ఇక, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కుక్క పళ్లను క్లీన్ చేయించటానికి 5 లక్షలు ఖర్చు పెట్టిన యజమానిపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది అతడి పనిని మెచ్చుకుంటుంటే..మరికొంతమంది తిడుతున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.