‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా..’ అన్న సాంగ్ అందరికీ గుర్తుంది కదా! ఆ సాంగ్ కే అంత క్రేజ్ ఉందంటే.. బుల్లెట్ బైక్ కు ఎంత క్రేజ్ ఉండాలి చెప్పండి. డుగ్గు డుగ్గు మంటూ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ బుల్లెట్ బైకుపై వెళ్తుంటే ఆ మజాయే వారు. బుల్లెట్ బైక్ కొనాలని కలలు కనేవారు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. దాన్ని సొంతం చేసుకోలేని వారు మాత్రం.. మామా ఒక రౌండ్ ఇస్తావా అటు పోయొస్తా.. అంటూ ఉన్నవారి దగ్గర నుంచి తీసుకొని చక్కర్లు కొడుతుంటారు. అలాంటి వారికి కాసేపు సొంతోషాన్నిచ్చే వార్త ఇది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ ధర.. అక్షరాలా రూ.18,700 మాత్రమే. అవును మీరు విన్నది నిజమే. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.
ఒకప్పటి ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ లెజండరీ బైకుకు కొన్ని మార్పులు చేర్పులు చేసిన కంపెనీ ‘ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350’ మోడల్ పేరుతో విక్రయిస్తోంది. ప్రస్తుతం దీని షోరూ ధర రూ.2.20 లక్షలు. అయితే, ఈ బైక్ ధర 36 యేడ్ల కిందట రూ.18,700 మాత్రమే. అందుకు సంబంధించిన 1986 జనవరి 23 నాటి బిల్లు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాతకాలపు బైక్‌లంటే ఇష్టపడే బీయింగ్ రాయల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ బిల్లును పోస్ట్ చేశారు. రూ.18,700తో ఉన్న ఈ బిల్ 36 సంవత్సరాల పాతదని తెలిపారు. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన సందీప్ ఆటో కంపెనీ డీలర్ ఈ బిల్ అందజేసినట్లు తెలుస్తోంది.
ఈ బిల్లు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులు రంగంలోకి దిగి, నాటి జ్ఞాపకాల్ని, ఈ బైక్‌తో ఉన్న అనుబంధాలను నెమరు వేసుకుంటున్నారు. ఒక నెటిజెన్.. “నా దగ్గర 1984 ఫిబ్రవరి మోడల్ ఉంది. అప్పట్లో దీని ధర రూ.16,100. ఇప్పటికీ ఇది గత 38 సంవత్సరాల నుంచి నాతోనే ఉంది..” అని కామెంట్ చేశాడు. మరో నెటిజెన్ “తాను 1980లోనే ఈ మోడల్ బైక్‌ని రూ.10,500కి కొన్నాను..” అని చెప్పుకొచ్చాడు. మరికొందరు ఆ రోజులు గోల్డెన్ డేస్ అంటూ కామెంట్స్ చేశారు. బుల్లెట్ బైక్ పై.. మీ మక్కువను కామెంట్ల రూపంలో తెలియజేయండి.