నందమూరి ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికీ అభిమానులు ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరినీ అభిమానిస్తారు. వారి పుట్టిన రోజులు వచ్చాయంటే.. కేకు కటింగ్ లు, అన్నదానాలు, దుప్పట్లు, చీరలు పంపిణీ.. ఒక్కటేమిటీ తమ అభిమానం చాటుకునేందుకు అన్ని చేస్తారు. అలా తన అభిమానాన్ని చాటుకున్నాడు ఈ విశాఖ వాసి.
హీరోలకు, క్రికెటర్లకు, రాజకీయ నేతలకు అభిమానులు ఉండటం కామన్. వారిపై ప్రేమను పలుమార్లు అభిమానులు ప్రదర్శిస్తుంటారు కూడా. వారి పుట్టిన రోజు నాడు కేకులు కోయడం, దుప్పట్లు, చీరలు, అన్నదానాలు చేయడం చేస్తూ ఉంటారు. మరి కొంత అభిమానం ఎక్కువైతే.. వారి పేరిట రక్త దానాలు చేస్తారు. అలాంటి అభిమానం సంపాదించుకున్న నటుల్లో ముందు వరుసలో ఉంటారు నందమూరి కుటుంబం. సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు వీరికి కోట్లల్లో అభిమానులున్నారు. భాష, ప్రాంతీయతో సంబంధం లేకుండా అభిమానుల్ని సంపాదించుకుంది ఈ కుటుంబం. అయితే ఆ అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించిందో కుటుంబం.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామానికి చెందిన పులమరశెట్టి వెంకటరమణ సీనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఆయన కుమారుడు పులమరశెట్టి కోమలీ పెద్ది నాయుడుకి కూడా బాలకృష్ణ అంటే అమితమైన అభిమానం. ఇటీవల పెద్దినాయుడికి గౌతమీ ప్రియా అనే యువతితో వివాహం కుదిరింది. మార్చి 11న వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. అయితే పెళ్లి పిలుపుల కోసం ఆరు పేజీల ఆహ్వాన పత్రికను తయారు చేయించిందీ పులమర శెట్టి కుటుంబం. అందులో తమ హీరోలపై అభిమానాన్ని చాటుకున్నారు. ఆ ఆహ్వాన పత్రికలో ఎన్టీఆర్, బాలయ్య ఫోటోలను ముద్రించి తమకు వారిపై ఎంత అభిమానం ఉందో చెప్పకనే చెప్పారు. పెళ్లి కార్డుపై నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో అని ఎన్టీఆర్ ఫోటోను ఉంచారు.
మరో పేజీలో బాలకృష్ణ ఫోటో కూడా ఉంది. వధూవరులు ఫోటోలో.. వరుడు పెద్ది నాయుడు బాలయ్యతో దిగిన ఫోటోను కూడా ఉంచారు. ఈ ఆహ్వాన పత్రికను అందుకున్న బంధువులు, అతిధులు సైతం దీన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీపై తమకు ఉన్న అభిమానాన్ని జీవితంలో ఎంతో కీలకమైన ఘట్టమైన పెళ్లి వేడుకల్లో చూపించడం విశేషం. ఈ ఆహ్వాన పత్రికలో పెళ్లి కూడా ఎటువంటి చదివింపులు స్వీకరించడం లేదని రాసి ఉందీ. పెళ్లి అర్థరాత్రి అయినప్పటికీ అతిధులకు రెండు పూటలా కూడా భోజనం కూడా పెడుతున్నారట. సీనియర్ ఎన్టీఆర్, బాలయ్యపై అభిమానం చాటుకున్న ఈ కుటుంబంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం ఈ పెళ్లికార్డు వైరల్ గా మారింది.