ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాలకు ఎంత గొప్ప పేరుందో అందరికి తెలిసిందే. భోజన ప్రియులు ఎవరైనా సరే ఇండియాలో ఒకటి రెండు రుచులతో సరిపెట్టుకోరు. ఇండియాలోని ఏ రాష్ట్రంలోనైనా వంటకాలకు వంకపెట్టే అవసరమే లేదు. ముఖ్యంగా సౌత్ లోని ఆంధ్రా వంటకాలకు ప్రత్యేకమైన పేరుంది. తెలుగు రాష్ట్రాలలోని ఏ ఇంట్లో అయినా కూర, పప్పుతో పాటు ఇతర పచ్చళ్లు కూడా ఉంటాయి.
అదే తెలుగు రాష్ట్రాల ఫంక్షన్లు, పండుగలలో వంటకాలను చూస్తే ఆహా అనాల్సిందే. ఎందుకంటే సాంప్రదాయ వంటలతో పాటు స్నాక్స్, పానీయాలు అన్ని రకాల ఐటమ్స్ కనిపిస్తాయి. ఇటీవల కాలంలో ‘బాహుబలి థాలీ’ అనే భోజనానికి చాలా డిమాండ్ ఏర్పడింది. దీనిలో ఒకేసారి చాలా రకాల వంటకాలను పెడతారు. అవన్నీ సింగిల్ సిట్టింగ్ లో తినాలి. అన్ని రకాలంటే ఎంతటి వారికైనా అసాధ్యంగానే అనిపిస్తుంది.
తాజాగా కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ఒక రెస్టారెంట్(నాయుడుగారి కుండ బిర్యానీ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ రెస్టారెంట్లో పెట్టే ‘బాహుబలి థాలీ’ని ఎవరు తినగలిగితే వారికి అక్షరాల 1 లక్ష రూపాయలను బహుమానం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే భోజనం చేసి లక్ష రూపాయలు సంపాదించాలని ఉందా.. అయితే నాయుడుగారి కుండ బిర్యానీకి రండి అంటూ ఓ వీడియో హల్ చల్ చేసింది.
ఈ వీడియోలో వడ్డించిన కుండ బిర్యానీ, అన్నం, రకరకాల కూరలు, స్వీట్స్, నూడిల్స్ లాంటి చాలా వంటకాలు ఉన్నాయి. అలాగే 4 రకాల పానీయాలు కూడా ఉన్నాయి. ఈ థాలీని ఎవరు 30 నిమిషాల్లో తినగలిగితే.. వారికి ఒక లక్ష రూపాయలు బహుమతి. చాలామంది ప్రయత్నించి తినలేకపోయారు. కానీ ఓ యువకుడు బాహుబలి థాలిని ఆహా అంటూ తినేశాడు. ఆ వెంటనే లక్ష రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకొని సోషల్ మీడియా వార్తల్లో నిలిచాడు. మరి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ బాహుబలి థాలీ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.