ప్రేమ పేరు చెప్పి పార్కులు, సినిమాలు గట్రా తిప్పి నట్టేట ముంచుతున్న రోజులివి. ఇలాంటి రోజుల్లో నిజమైన ప్రేమికులు ఉన్నారా! అంటే అంతుచిక్కని ప్రశ్నే. కానీ, అలాంటి అమర ప్రేమికులు భూమి మీద ఇంకా ఉన్నారని చూపించాడు.. పాకిస్తాన్ కు చెందిన సయ్యద్ బాసిత్ అలీ అనే ఇంటర్వ్యూయర్. ఈయన చెప్పిన ప్రకారం.. 19 ఏళ్ల యువతి 70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. అందుకోసం ఆమె పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావట.
పాకిస్తాన్, లాహోర్ కు చెందిన షుమైలా (19), లియాఖత్ అలీ (70) లకు మార్నింగ్ వాక్ వెళ్లే అలవాటు ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు లియాఖత్.. షుమైలా వెనుక జాగింగ్ చేస్తూ ఓ పాటను హమ్ చేశాడు. అంతే.. లవ్ అట్ ఫస్ట్ సైట్. వీరి ప్రేమ వ్యవహారం మొదలైంది.. వయస్సులో తేడా ఉన్నా అవేమి కనపడలేదు. అనతి కాలంలో వారి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకున్నారు. తాజాగా, మీ పెళ్లి ఎలా జరిగింది?, వయస్సులో ఇంత తేడా ఉన్నా ఎలా ప్రేమలో పడ్డారు? అంటూ ఇంటర్వ్యూయర్ సయ్యద్ బాసిత్ అలీ వారిని ప్రశ్నించారు. దీంతో వీరి ప్రేమ జ్ఞాపకాలు బయటకొచ్చాయి.
దీనికి షుమైలా ఇచ్చిన సమాధానమేంటో తెలుసా? ప్రేమ వయస్సును చూడదని, అది అలా జరిగిపోతుందని చెప్పుకొచ్చింది. అయితే వీరిద్దరి పెళ్లికి షుమైలా తల్లిదండ్రులు మొదట అంగీకరించలేదట. తర్వాత వారిని ఒప్పించానని పేర్కొంది. “మొదట్లో నా తల్లిదండ్రులు మా పెళ్ళికి అభ్యంతరం వ్యక్తం చేశారు, కాని మేము వారిని ఒప్పించగలిగాం.” అని చెప్పుకొచ్చింది. ఇక లియాఖత్ అలీ మాట్లాడుతూ.. పెళ్లిలో రోమాన్స్ పెద్ద విషయం కాదని చెప్పుకొచ్చాడు. అలాగే చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి అనుమతి ఉన్న ఎవరైనా వివాహం చేసుకోవచ్చని, వయస్సుతో పని లేదని తెలిపాడు. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనప్పుడు.. వయస్సు బేధం చూడకూడదని తన అభిప్రాయాన్ని తెలిపాడు. వీరి ప్రేమకథను తెలుసుకున్న నెటిజన్లు వీరి నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.