హైదరాబాద్.. ఐటీ రంగంలో దూసుకెళ్తున్న మహానగరం. భారతదేశంలో ఇతర నగరాల కంటే ఎక్కువగా ఐటీ, స్టార్టప్ కంపెనీలకు వేదికగా నిలుస్తోంది హైదరాబాద్. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో కంపెనీలు తమతమ కంపెనీలను ప్రారంభించేందుకు అనువైన స్థలంగా హైదరాబాద్ ను పేర్కొంటున్నాయి. దాంతో ఇప్పటికే పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలకు కేంద్రబిందువైంది భాగ్యనగరం. ఇక హైదరాబాద్ మణిహారంలో మరో ఐటీ హబ్ చేరబోతోంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం కూడా అయ్యాయి. త్వరలోనే మలక్ పేటలో 16 అంతస్తులతో మరో ఐటీ టవర్ ఏర్పాట్లకు అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్.. మల్టీ నేషనల్ కంపెనీలకు ప్రస్తుతం కేంద్రబిందువు. ఎన్నో స్టార్టప్ కంపెనీలకు అనువైన ప్రాంతంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. అందుకు అనుగుణంగానే ఇక్కడి భారాసా ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో పలుచోట్ల IT హబ్ లను ఏర్పాటు చేయడంతో ఐటీ రంగం మరింతగా అభివృద్ధి చెందింది. దానితో పాటుగా స్టార్టప్ కంపెనీలు కూడా పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ హబ్ లను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే మరో ఐటీ హబ్ ను మలక్ పేట్ కేంద్రంగా ఏర్పాటు చేయడానికి బిడ్లను సైతం ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది.
ఈ క్రమంలోనే మలక్ పేటలోని 10.35 ఎకరాల స్థలంలో రూ.1032 కోట్ల రూపాయలతో 16 అంతస్తుల్లో ఐటీ టవర్ ను ఏర్పాటు చేయనున్నారు. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేస్తుండగా.. ఇది పాతబస్తీ వరకు విస్తరిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో అక్కడి యువతకు ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుందని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ తో పాటుగా సిద్దిపేట్, నల్గొండ, మహబూబ్ నగర్ లలో ఐటీ హబ్ ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తలపెట్టిన ఐటీ హబ్ లు అన్ని పూర్తి అయితే.. దేశంలోనే ఐటీ రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా మారనుంది. మరి హైదరాబాద్ లో మరో ఐటీ హబ్ ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.