ఆపద సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించి విద్యార్థుల పాలిట దేవుడయ్యాడు ఆ ఉపాధ్యాయుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది విద్యార్ధుల ప్రాణాలను రక్షించి గొప్ప పని చేశాడు. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నా ఆ టీచర్ పై అభినందనలు వెల్లవెత్తుతున్నాయి.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురువులను దైవంతో సమానంగా భావిస్తుంటాం. అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయులకు సమాజంలో ఎనలేని గౌరవం ఉంటుంది. విద్యార్థులను సన్మార్గంలో నడిపించి, వారిలో నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో టీచర్లు చేస్తున్న కృషి మరువలేనిది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఉపాధ్యాయులు సమాజానికి నిజమైన దార్శనికులు. స్కూల్లోకి అడుగుపెట్టిన ప్రతి విద్యార్థిని తమ సొంత బిడ్డల్లా భావించి కంటికి రెప్పలా కాపాడుతూ విద్య నేర్పిస్తుంటారు గురువులు. కాగా ఓ ఉపాధ్యాయుడు ఏకంగా 40 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ఆపద నుంచి గట్టెక్కించాడు. అసలు ఏం జరిగిందంటే..
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లి భారీగా వరదలు సంబవించాయి. జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లాలోని మోరాంచపల్లి గ్రామం వాగు ఉప్పొంగటంతో జలదిగ్బందంలో చిక్కిపోయి వందలాది మంది గ్రామస్థులు నిరాశ్రులయ్యారు. జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగటంతో.. ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామం మొత్తం జలదిగ్బందమైంది. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో గురుకుల పాఠశాల ఉపాధ్యాయుని సమయస్ఫూర్తి 40 మంది విద్యార్ధుల ప్రాణాలు కాపాడింది.
కొండాయి పల్లిలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు పాయం మీనయ్య. అయితే భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి వరదలు చోటుచేసుకుంటున్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తపడ్డాడు. జంపన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తే పాఠశాలను వరద ముంచెత్తుతుందని భావించి సమయస్ఫూర్తితో ఆలోచించి 40 మంది విద్యార్థులను తనతోపాటు ఇంటికి తీసుకెళ్లారు. విద్యార్థులకు తన ఇంట్లోనే వసతి కల్పించి భోజనం కూడా పెట్టారు. దీంతో విద్యార్ధులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషయం తెలసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. మంత్రి కెటిఆర్ ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేసారు. చాలా గొప్ప పని చేశారంటూ పాయం మీనయ్యను అభినందించారు. వరదగండం నుంచి విద్యార్థులను రక్షించిన ఉపాధ్యాయుడు మీనయ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Great Job Payam Meenaiah Garu 🙏 https://t.co/eCDbWQH0Ly
— KTR (@KTRBRS) July 30, 2023