తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం నియిజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లో ఈ పోలింగ్ జరగగా, సాయంత్రం 5 గంటల సమయానికి 77.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే క్యూలైన్‌లో వున్న ఓటర్లకు సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2018లో ఇక్కడ 91.30 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడంతో ఓటర్లు పట్టం కట్టనున్నారన్న విషయమై కొన్ని సంస్ఠలు ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించాయి. వాటి నివేదికలను విడుదల చేశాయి. వాటిని పరిశీలిస్తే..
మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం 47 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా, ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలను బట్టి చూస్తే అధికార పార్టీకే ఓటర్లు పట్టం కట్టనున్నారని తెలుస్తోంది. ఇక మునుగోడు ఉపఎన్నిక ఎందుకు జరుగుతున్నది అన్నది చుస్తే.. ఈ ఏడాది ఆగస్టు 8న మునుగోడు ఎమ్మెల్యే పదవికి అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం విజయం సాధించిన ఆయన, ఈసారి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.