ప్రజా కవిగా, ప్రజా గాయకుడిగా, విప్లవకారుడిగా కోట్లాదిమంది హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రజాయుద్ధనౌక గద్దర్. ఆయన పాటలతో ప్రజలను ఉర్రూతలూగించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని చాలా రాష్ట్రాలకు పరిచయం అవసరం లేని వ్యక్తి ప్రజా గాయకుడు గద్దర్. భూమి కోసం.. భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం.. తన గళంతో ఉద్యమ స్పూర్తినందించిన గొప్ప గాయకుడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా.. పాటలతో కోట్లాది మంది తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచారు ప్రజా గాయకుడు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఒక మాటలో చెప్పాలంటే.. తన పాటతో పల్లె పల్లెనా తెలంగాణ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు గద్దర్. మొదటి నుంచి గద్దర్ తెలంగాణ వాది. జులై 6, ఆదివారం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రజాకవి, ప్రజాగాయకుడు, యుద్దనౌక గద్దర్ కన్ను ముశారు. రెండు రోజుల క్రితం అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. తనదైన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు గద్దర్. ఆయన అసలు పేరు విఠల్ రావు.. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు.. ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. గద్దర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా అసలు పేరు విఠల్ రావు.. చిన్నప్పటి నుంచి నేను చదువులో ఫస్ట్.. ఒకసారి తరగతి గదిలో టీచర్ నన్ను పిలిచి మీది ఏకులం అని అడిగింది.. నేను అంటరానోళ్లం అని చెప్పిన.. అంతే మరి నీకెందుకురా రావు? అని నా పేరు చివర ఉన్న రావు తీసేశారు. ఇప్పుడు స్కూల్ రికార్డుల్లో నా పేరు విఠల్ అనే ఉంటుంది. ఉస్మానియా కాలేజ్ లో చేరిన కొత్తలో కొంతమంది నా జుట్టు కత్తిరించి వెక్కిరించేవారు.. అప్పట్లో ఒక్క పూట తిండి కోసం, కాలేజ్ ఫీజు కోసం హూటల్ లో పని చేశా’ అని అన్నారు.
‘తెలంగాణలో చిన్న జాతి వారంటే చాలా చులకనగా భావిస్తుంటారు.. ఈ అసమానతల ఎదిరించి నిలిచేందుకు నా ఉనికి చాటుకునేందుకు అడుగడుగునా అవమానాలు, ఛీత్కారలు ఎదురయ్యాయి. అయినా నేను వెనక్కి తగ్గలేదు. బుర్ర కథ కళాకారుడిగా 1969లో బుర్రకథలతో ప్రజలను ఉత్తేజపరుస్తూ వచ్చాను. అప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో దెబ్బలు తిన్నా.. అప్పట్లో దేవుడి గుడిలో జరిగిన ఓ కార్యక్రమంలో నన్ను ప్రదర్శన ఇవ్వమన్నారు.. అక్కడ కొంతమంది పెద్దలు విఠల్ రావు స్టేజ్ పై కాదు.. నేలపై ఉండి ప్రదర్శన ఇవ్వాలని ఆంక్షలు పెట్టారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో అవమానాలు నా జీవితంలో ఎదుర్కొన్నాను’ అని అన్నారు.