ఏ ఇంట్లో అయినా ఉల్లిపాయ లేనిదే వంట పూర్తి కాదు. భారతీయ వంటకాల్లో ఉల్లి పాత్ర ప్రధానమైనది. ఉల్లి ధర పెరిగితే.. ఓ పాయ.. తగ్గితే రెండు పాయలు వేసుకుని వంట పూర్తి చేస్తారు నారీ మణులు. నిన్న, మొన్నటి వరకు ఉల్లి ధరలు పెరగ్గా.. ఇప్పుడు తగ్గు ముఖం పడుతున్నాయి.
కోస్తేనే కాదూ అమ్మినా, కొన్నా కూడా కళ్ల వెంట నీళ్లే వస్తాయి అని నిరూపించిందీ ఉల్లి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ రైతులకు మాత్రం ఆ ఉల్లి బాధనే మిగిల్చింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర దేవుడెరుగు.. పెట్టుబడి ధర రాక రైతులు విలవిలాడారు. కిలోకు రెండు రూపాయలు ధర పలకడంతో దిగులు చెందారు రైతులు. కొంత మంది రైతులైతే ఉల్లికి సరైన ధర రాకపోవడంతో రవాణా ఖర్చులైనా మిగులుతాయని ఆలోచించి పశువులకు మేతగా లేదంటే తగులబెట్టేయడం చేశారు. దళారీలు మాత్రం దండుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి.. బహిరంగ మార్కెట్‌లో అమ్మే సమయానికి వేలల్లో ధర చెబుతున్నారు. దీంతో కొనే వాడికి మంట కలుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఉల్లి ధర తగ్గుతూ వస్తుంది.
ఉల్లి లేని ఇల్లు లేదు. ఏ కూరలోకైనా ఉల్లి పాయ ఉండాల్సిందే. వంట గదిలో ఉల్లిపాయ లేకపోతే ఏదో వెలితి. దీనితో రకరకాలు వంటలు చేసుకుని తింటుంటారు. అందుకే ఉల్లిపాయ రేటు పెరిగితే సామాన్యులకు సైతం నెత్తిన పిడుగుపడినట్లవుతుంది. మొన్నటి వరకు కూడా హైదరాబాద్ నగరంలో కూడా క్వింటాల్ ఉల్లి ధర రూ. 1200 నుండి 2 వేల వరకు పలికింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో రిటైల్, ఇతర దుకాణాల్లో ఉల్లి ధర రూ. 16 నుండి రూ. 25 వరకు పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్‌లో కిలో ఉల్లిని రూ.12 నుంచి రూ.21 వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో హోల్ సేల్‌గా రూ. 12కే కిలో ఉల్లిపాయలు లభిస్తున్నాయి. అటు హోటల్స్, క్యాటరింగ్ బిజినెస్ చేసేవాళ్లకు కూడా ఈ న్యూస్ ఉపశమనాన్ని ఇస్తుంది.
అయితే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున పండించిన ఉల్లి ధర తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉల్లి సరఫరా పెరిగి రేట్లు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. మలక్‌పేట మార్కెట్‌తోపాటు నగరంలోని పలు మార్కెట్లు కుప్పులు కుప్పలుగా ఉన్న ఉల్లి నిల్వలతో కళకళలాడుతున్నాయి. కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 70 ట్రక్కుల ఉల్లిపాయలు ప్రతి రోజు మార్కెట్‌కు వస్తున్నాయని ఓ వ్యాపారి తెలిపారు. తెలంగాణలోని నారాయణఖేడ్, తాండూరు, మహబూబ్‌నగర్ నుంచి కూడా లారీలు వస్తున్నాయని అన్నారు. అందుబాటులోకి ఉల్లి ధరలు రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.