ఈ మద్య సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, బడా వ్యాపారులకు బాంబు పెట్టి ఇల్లు పేలుస్తామని బెదిరింపు కాల్స్ రావడం చూస్తూనే ఉన్నాం. పోలీసులు రంగంలోకి దిగి బెదిరింపు కాల్స్ చేసిన వాళ్లను పట్టుకొని స్టేషన్ కి తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల దేశంలో బెదిరింపుల కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, బడా వ్యాపారులకు బాంబు పెట్టి ఇల్లు పేలుస్తామని.. చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం కామన్ అయ్యింది. తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొంత కాలంగా వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది తనను చంపేస్తామని.. వీడియోలు పోస్ట్ చేశారని వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు స్వీకరించిన బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కోమటిరెడ్డి వెంటట్ రెడ్డి తనను తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆయన తనయుడు కలిసి హత్య చేస్తామని బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మద్యనే చెరుకు సుధాకర్ తనపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇక ముందు ఇలాంటివి తమ కార్యకర్తలు, అనుచరులు సహించబోరని చెరుకు సుధాకర్ తనయుడు సుహాన్ కి స్వయంగా ఎంపీ కోమటిరెడ్డి కాల్ చేసి బెదిరించిన విషయం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమకారులు కోమటిరెడ్డి పై భగ్గుమన్నారు. ఒక ప్రజాప్రతినిధి హోదాలు ఉంటూ తెలంగాణ ఉద్యమకారుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమను హత్య చేస్తామని బెదిరించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చెరుకు సుధాకర్ తనయుడు సుహాన్ పోలీసులతో పాటు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు.