నేటి ఆధునిక కాలంలో సెల్ ఫోన్ ఒక్క క్షణం చేతిలో లేకపోతే ప్రాణాలు పోయినంత పని అవుతుంది కొందరికి. ఎక్కడికి వెళ్లినా ఫోన్ చేతిలో ఉండాల్సిందే.. ఆఖరి బాత్రూంకి వెళ్లినా కూడా. అంతలా మనిషి జీవితంలో భాగమైపోయింది ఈ చరవాణి. మరి అలాంటి ఫోన్ మనం పోగొట్టుకుంటే.. ఇంకేముంది పరుగు పరుగున పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం. వెంటనే కంప్లైంట్ ఇచ్చి ఫోన్ త్వరగా వెతకండి అని వారిని అభ్యర్థిస్తాం. అయితే ఇప్పుడు రూల్స్ మారాయి అంటున్నారు పోలీసులు. ఇక ముందు మీ ఫోన్ పోతే డైరెక్ట్ గా పోలీసు స్టేషన్ కు రావొద్దు అంటూ సూచిస్తున్నారు. ముందు మీ సేవకు వెళ్లండి అని చెబుతున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సెల్ ఫోన్.. మనిషి జీవితంలో, శరీరంలో భాగమైన ఓ ఎలక్ట్రానిక్ వస్తువు. మనకు సంబంధించిన అన్ని విషయాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. ఇక డబ్బుకు సంబంధించిన అన్ని లావాదేవీలు ప్రస్తుతం సెల్ ఫోన్ నుంచే చేస్తున్నాం. మరి అలాంటి ఫోన్ ఒక్కసారిగా పోతే.. మన ప్రాణం పోయినంత పని అవుతుంది. వెంటనే వెళ్లి పోలీసు కంప్లైంట్ ఇస్తాం. కానీ ఇక నుంచి అలా కుదరుదు అంటున్నారు పోలీసులు. సెల్ ఫోన్ పోతే ముందుగా మీ-సేవకు వెళ్లాలి అని సూచిస్తున్నారు. గతంలో మాదిరిగా సెల్ ఫోన్ పోయిందని కాగితం మీద వివరాలు రాసి ఇస్తే కుదరదు అంటున్నారు. ముందుగా మీ-సేవకు వెళ్లి అక్కడ పోన్ కు సంబంధించిన వివరాలు నమోదు చేయించుకోవాలి. రూ. 200 చలాన్ సైతం కట్టి.. రశీదు తీసుకొచ్చి పోలీసు స్టేషన్ లో ఇవ్వాల్సి ఉంటుందని హైదరాబాద్, రంగారెడ్డి పోలీసులు సూచిస్తున్నారు. అయితే సెల్ ఫోన్ పోయిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న కారణంగా ఇలాంటి పద్దతిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.