సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు ఎంత ప్రధానమో గాలిపటాలకు అంతే క్రేజ్. ఈ పండుగ సమయంలో పిల్లలు, పెద్దలు అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంస్కృతి పెద్దగా కనిపించప్పటికీ, నగరంలో ఏ బిల్డింగ్ పైన చూసినా వీరే కనిపిస్తుంటారు. అయితే.. ఈసారి ఆ ఆనందం దూరమైనట్లే. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, ప్రధాన కూడళ్లు, ప్రార్థనాస్థలాలు, చుట్టు పక్కల ప్రాంతాల్లో పతంగులను ఎగురవేయడాన్ని హైదరాబాద్ పోలీసులు నిషేధించారు. ఈ నిషేధం జనవరి 14న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉండనుంది. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే, బహిరంగ ప్రదేశాల్లో డీజే సౌండ్లు పెట్టరాదని సీపీ ఆదేశించారు. శబ్ద కాలుష్య (నియంత్రణ) రూల్స్ 2000లోని రూల్ 8 ప్రకారం సంబంధిత పోలీసు అధికారుల నుండి అనుమతి లేకుండా, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు/ డీజేలను నిషేధిస్తున్నట్టు పోలీసులు తమ ఆదేశాల్లో తెలిపారు. వాణిజ్య ప్రాంతాల్లో పగటిపూట 65 డెసిబుల్స్, రాత్రి సమయాల్లో 55 డెసిబుల్స్, నివాస ప్రాంతాల్లో పగలురాత్రి 55 డెసిబుల్స్‌కు ధ్వని తీవ్రత పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
ఇక నిషేధం లేని ప్రాంతాల్లో పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు. నివాస సముదాయాలపైకి, బాల్కనీల్లోకి పిల్లలను అనుమతించకూడదని తెలిపారు. గోడలపై నిల్చుని పతంగులు ఎగురవేయొద్దని సూచించారు. గాలిపటాలు సేకరించేందుకు తమ పిల్లలు రోడ్లపై పరుగులు తీయకుండా చూడాలని తల్లిదండ్రులను కోరారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద చిక్కుకుపోయిన గాలిపటాలను సేకరించే ప్రయత్నం చేస్తే, కరెంట్ షాక్ కొడుతుందనే విషయంపై పిల్లలకు అవగాహన కల్పించాలి అని సీపీ తెలిపారు. అలాగే, భోగి మంటల కోసం బలవంతంగా కలపను సేకరించవద్దని, యజమానుల సమ్మతితో మాత్రమే కలపను సేకరించాలని కోరారు.
Hyderabad City Police wishes you all and your families a very happy Bhogi and Sankranti .Enjoy Kite flying and be Safe 😷💐🌿🎋🪴🪁🪁
— C.V.ANAND, IPS (@CPHydCity) January 14, 2022