దేశ వ్యాప్తంగా వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో.. విధుల్లో సంబురాలు నిర్వహిస్తుంటారు. వినాయక చవితి పండుగ వస్తుందంటే అందరి మదిలో ముందుగా మెదిలేది ఖైరతాబాద్ వినాయక విగ్రహం. భారీ ఆకారంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు ఖైరతాబాద్‌లో ఓ పుణ్యక్షేత్రంగా మారుతుంది. లక్షలాది మంది భక్తులు గణపతి దర్శనార్థం ఇక్కడకు వస్తుంటారు. గత రెండేళ్లుగా దేశాన్ని పట్టి పీడిస్తుస్తున్న కరోనా మహమ్మారి వల్ల వినాయక ఉత్సవాలు ఉత్సాహం లేకుండానే సాగుతుంది.
ఈ ఏడాది కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వినాయక ఉత్సవాలకు రెడీ అవుతున్నారు భక్తులు. గత ఏడాది కరోనా కారణంగా కేవలం 11 అడుగుల ఎత్తుకే పరిమితమైన ఈ గణపయ్యను ఈసారి భక్తుల కోరిక మేరకు 40 అడుగుల ఎత్తుతో తయారు చేశారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పూర్తైంది. విగ్రహ తయారీలో చివరి ఘట్టమైన కళ్లు అద్దకాన్ని కళాకారులు పూర్తి చేశారు. నేటి నుంచి ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వారం రోజుల ముందుగా ఖైరతాబాద్ గణేషుడు దర్శనం ఇస్తున్నారు. 11 రోజులపాటు ఓ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తలపించే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో విలసిల్లుతుంది.
గణపతితో పాటు ఖైరతాబాద్‌లో ఇరువైపులా ప్రతియేటా దేవాతా మూర్తులను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి వినాయక విగ్రహంలో మరిన్ని ప్రత్యేకతలు ఉండేలా చూస్తున్నారు. గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తుతో కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహం ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. పుట్టల నడుమ భారీ నాగ దేవతపై కొలువుండే విధంగా కాల నాగేశ్వరి అమ్మవారిని ప్రత్యేక సెటింగ్‌ల నడుమ తయారు చేస్తున్నారు. ఎడమ వైపున శ్రీకృష్ణుడిని ఆవహించిన కాళికా దేవి స్వరూపమైన కృష్ణకాళి రూపంలో మరో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఇక విగ్రహ తయారీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది కళాకారులు మూడు నెలల పాటు రాత్రుంబవళ్లు శ్రమించారు. వినాయకుణ్ని కొలిస్తే సకాలంలో వర్షాలు పడటంతోపాటు, తాము అనుకున్న కోరికలు నెరవేరతాయని అందరూ భావిస్తారు.
