మనిషి ప్రాణం ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. కానీ ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే మృత్యువు ఎటువైపు నుంచి పొంచిఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంటి నుంచి బయటకి వచ్చినవారు క్షేమంగా ఇంటికి వెళ్తారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
మనిషి ప్రాణాలు ఏ క్షణంలో పోతాయో ఎవరూ ఊహించలేరు. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని పెద్దలు అంటారు. ఉదయం లేచిన మొదలు.. పడుకునే వరకు బీజీ లైఫ్. రోడ్డు మీదకు వస్తే.. ఇంటికి ప్రాణాలతో వెళ్తామా అన్న అనుమానాలు కలుగుతున్న కాలం ఇది. ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు.. హార్ట్ ఎటాక్, ఊహించని పరిస్థితుల్లో చనిపోవడం.. ఒక్కటేమిటి ఎన్నో రకాలుగా మృత్యువు వెంటాడుతుంది. ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే చాలు.. ఎన్ని కష్టాలు పడైనా సరే ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా పాతబస్తీలో అకస్మాత్తుగా జనాలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనే విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ పాతబస్తీలో సంతోష్ నగర్, చాంద్రాయణ గుట్ట ప్రధాన రహదారిపై సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న ఓ ఆటోలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయ్యింది. బోయన్ పల్లి నుంచి గగన్ పహాడ్ లో డెలివరీ కోసం వెళ్తున్న ఆటోలో గ్యాస్ లీక్ అయ్యింది. అది గమనించిన వాహనదారులు ఒక్కసారిగా తమ వాహనాలను రోడ్డుపైనే వదిలేసి మరీ పరుగులు పెట్టారు. అటుగా వస్తున్న వారికి ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు.. గ్యాస్ లీక్ అన్న విషయం తెసిన తర్వాత వారు సైతం భయంతో పరుగులు తీశారు. ఆటో డ్రైవర్ రోడ్డుపైనే వదిలివేసి పారిపోయాడు. దాంతో చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా, ఆటోలో పన్నెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు సమాచారం.
ఈ విషయం గురించి తెలుసుకున్న ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వాహనదారులను దూరంగా పంపించివేశారు. ఆటోలోని మిగతా సిలిండర్లను జాగ్రత్తగా కిందకు దింపారు. అదే సమయానికి అగ్నిమాకప సిబ్బంది వచచి ప్రమాద నివారణ చర్యలు తీసుకున్నారు. మొత్తానికి గ్యాస్ సిలిండర్ లీకేజ్ ని ఆపివేశారు. ఈ సంఘటన వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం నుంచి తప్పించడంతో స్థానికులు అభినందించారు.