దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న దేశంలో 67,597 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న కోలుకున్న వారి సంఖ్య 1,80,456గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 170,21,72,615 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభన కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ పూర్తిగా ముగిసిందని చెప్పుకోవచ్చని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు.
ఇది చదవండి: ఎన్టీఆర్ డ్రెస్ కి రామ్ చరణ్ ఫిధా
ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… థర్డ్ వేవ్ మొదలైనప్పటి నుంచి తాము సమర్థ వంతగా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అయితే జనవరి 28న థర్డ్ వేవ్ ఉధృతి పెరిగిందన్నారు. టీకా తీసుకున్నవారిలో కరోనా ప్రభావం తక్కువగా ఉందన్నారు. కరోనా రానున్న రోజుల్లో సాధారణ ఫ్లూగా మారనుందని చెప్పారు. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెప్పారు. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను విరమించుకోవచ్చని అన్నారు. అన్ని సంస్థలు వంద శాతం పనిచేసుకోవచ్చని తెలిపారు. విద్యాసంస్థలను పూర్తి స్థాయిలో ప్రారంభించినట్టుగా చెప్పారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని.. ప్రస్తుతం అది 2 శాతం కంటే తక్కువగా ఉందని చెప్పారు. అంతే కాదు త్వరలో కరోనా కేసులు భారీగా పడిపోనున్నాయని చెప్పారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారని ఆయన అన్నారు. తెలంగాణలో 103 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పని చేసిందని తెలిపారు. ప్రస్తుతం కరోనా ఆంక్షలు సడలిస్తున్నామని చెప్పారు.