మరణానికి చిన్న పెద్దా తేడా లేదు. కానీ ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. గతంలో మధ్య వయస్కులు, వయస్సు పై బడిన వారూ ఎక్కువగా హార్ట్ ఎటాక్ కు గురయ్యేవారు. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అకాల మరణం చెందుతున్నారు. నటుడు తారకరత్న ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతున్నారు. మరో చోట పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక గుండెపోటుతోనే మరణించిన సంగతి విదితమే.
తాజాగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండె పోటుకు గురై చనిపోయాడు. ఎల్ బి నగర్ నుండి ఉప్పల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు న్యూ నాగోలు వద్దకు రాగానే బైక్ పక్కకు ఆపి.. ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అతడి ఇబ్బందిని గమనించిన స్థానికులు నీరు తాగించేందుకు ప్రయత్నించారు. 108 ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో ఆటోలో నాగోలులోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు.
అతడి ఐడి కార్డు పరిశీలించగా.. గౌరవ్ కుమార్ అని, నాగోలులోని ఇందూ అరణ్య సమీపంలోని శ్రేయాస్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేస్తున్నట్లు తెలిసింది. అతడిది ఆర్కే పురం అని సమాచారం. బీటెక్ చదివి చేతికొస్తాడన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతున్నారో. చిన్న వయసులో ఇలా గుండె పోటుతో మరణాలు సంభవించడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.