ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బెదిరించి, ఆత్మహత్యాయత్నానికి పూనుకునేలా చేశాడంటూ లక్ష్మీకాంత్ శర్మ అనే జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
మల్లన్న జైలులో ఉండగానే ఒకదాని తర్వాత మరో కేసు తెరపైకి వచ్చాయి. ఆయనకు బెయిల్ రావడం.. కొత్త కేసులో మళ్లీ జైలుకు వెళ్లడం జరుగుతోంది. తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. తీన్మార్ మల్లన్న 74 రోజులు జైల్లో ఉన్నారు.
తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య ఇటీవల హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, జైలులో ఉన్న సమయంలోనే తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.