హార్లీ డేవిడ్సన్ లాంటి బైకో, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైకో నడపాలని చాలా మందికి కల ఉంటుంది. అయితే దాని ధర చూసి మనకెందుకండి ఈ హార్లీ డేవిడ్సన్ లు, రాయల్ ఎన్ఫీల్డులు అని తలదించుకుని.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అయితే పర్యావరణం మీద ప్రేమతో.. బైక్ మీద ఉన్న ఇష్టాన్ని చంపుకుంటారు. ఇంకొంతమంది అయితే.. లుక్ కోసం చూసుకుంటే మన జీవితం అడ్డంగాస బుక్ అయిపోతుందని వెనక్కి తగ్గుతారు. అందంగా ఉందని దీన్ని మేపడం అవసరమా అధ్యక్షా అని ఆగిపోతారు. అవును మరి పెరుగుతున్న ధరలకు తోడు ఈ మైలేజ్ నివ్వని బైకులు తాగే తాగుడికి మన లివరు, కిడ్నీలు, మొత్తం శరీరంలో ఉన్న అవయవాలన్నీ కొట్టేస్తాయి.
లుక్ ఉండి, పర్యావరణాన్ని పాడు చేయకుండా.. ఎక్కువ మైలేజ్ నిచ్చే బైక్ ఏదైనా ఉందా? అంటే లేదనే చెప్పాలి. కానీ ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉంది. దాని రేటు కూడా సో కాల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పోలిస్తే తక్కువే. ఏథర్, టీవీఎస్, ఓలా లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ 100 నుంచి 180 కిలోమీటర్ల రేంజ్ నిస్తే.. ఇప్పుడూ మనం చెప్పుకునే బైక్ ఏకంగా 300 కిలోమీటర్ల రేంజ్ నిస్తుంది. దాని పేరు ఈ-డైరోత్. ఇండియా యొక్క మొదటి మజిల్ ఎలక్ట్రిక్ బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది. పవర్ ఫుల్ లార్జ్ డిస్ప్లేస్మెంట్ మోటార్ తో హై పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ గా రాబోతుంది ఈ మజిల్ ఎలక్ట్రిక్ బైక్. ఎకో తేజస్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తయారు చేసింది ఈ హై స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని.
హార్లీ డేవిడ్సన్ బైక్ లను ఇష్టపడే వారి అభిరుచికి తగ్గట్టు ఆ డిజైన్ లో ఈ ఈవీ బైక్ లను దింపుతోంది. టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు ప్రయాణించేలా ఈ బైక్ ని రూపొందించారు. 4 కిలో వాట్ హై ఆర్ఫీఎం మిడ్ డ్రైవ్ మోటార్ తో గంటకు 100 కిలోమీటర్ల రేంజ్ తో దీన్ని తయారు చేశారు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. ఈ బైక్ రెండు బ్యాటరీలతో వస్తుంది. ఒక బ్యాటరీని ఛార్జ్ చేస్తే.. 150 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఆ రకంగా రెండు బ్యాటరీలతో 300 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. బ్యాటరీ, కంట్రోలర్, క్లస్టర్ వంటి వాటితో ఇంటిగ్రేట్ అయ్యేలా ఈ స్మార్ట్ బైక్ ని రూపొందించారు. బ్యాటరీ కనెక్షన్, పవర్ ట్రైన్, రైడర్ యొక్క మొబైల్ ఫోన్ తో కనెక్ట్ చేసే డ్యాష్ బోర్డు రైడర్ కి మంచి అనుభూతినిచ్చేలా డిజైన్ చేశారు.
దేశంలో ఉన్న ఏ రోడ్లకైనా ఈ బైక్ సూట్ అయ్యేలా తయారు చేశారు. ఇప్పటి వరకూ ఈవీ బైక్ సెగ్మెంట్స్ లోనే మేము కనుగొన్న మోస్ట్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఇదని ఎకో తేజస్ డైరెక్టర్ కె.వెంకటేష్ అన్నారు. ఈ బైక్ ని కొంటున్నప్పుడు.. పర్యావరణ అనుకూల వాహనాన్ని కొంటున్నామన్న ఉత్సాహాన్ని ప్రస్తుత యువతకు అందించడమే కంపెనీ లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే.. ఇంట్లో పెట్టుకోవచ్చు. అలానే కంపెనీ డీలర్లు ఇన్స్టాల్ చేసిన పార్కింగ్ స్పాట్స్ లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఇక దీని ధర విషయానికి వస్తే.. ఆన్ రోడ్ ధర లక్షా 30 వేలు ఉంటుందని అంటున్నారు. సింగిల్ బ్యాటరీతోనా? లేక డబుల్ బ్యాటరీతోనా? అనేది తెలియాల్సి ఉంది. సింగిల్ బ్యాటరీతో వచ్చినా గానీ హార్లీ డేవిడ్సన్ లుక్ లో 150 కిలోమీటర్లు రేంజ్ ఇచ్చే బైక్ లక్షా 50 వేలలో వస్తుందంటే పర్లేదు. స్పేర్ బ్యాటరీ కావాలనుకుంటే 30 నుంచి 50 వేల లోపే ఉంటుంది. ఎలా చూసినా 2 లక్షల లోపు హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్ వస్తుంది. ఇంతకంటే బైక్ ప్రియులకు ఇంకేం కావాలి. అన్నట్టు ఈ-డైరోత్ ఎలక్ట్రిక్ బైకులు డిసెంబర్ నుంచే భారతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
No No… this not a new electric bike from @royalenfield 🙂 🙂
Say hello to E-Dyroth an electric bike from Indian manufacturer EKO Tejas.@Ekotejas pic.twitter.com/6sjgCk1ZHh— khalid (@KhalidMatic) November 29, 2022