వాతావరణ కాలుష్యంతో పాటు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి బయటపడడానికి విద్యుత్ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకుంటున్నారు వాహనదారులు. అయితే కొన్నాళ్ళకు విద్యుత్ వినియోగం పెరిగిపోయి.. ఆ కరెంట్ ధరలు కూడా చుక్కలు చూపించే అవకాశం లేకపోలేదని ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూడని వాళ్ళు ఉన్నారు. దీనికి తోడు అస్తమానూ ఛార్జింగ్ పెట్టుడు, తీసుడు ఈ టెన్షన్ అంతా ఎవరు పడతారు అని చెప్పి కొనడానికి ఆసక్తి చూపించనివాళ్ళూ లేకపోలేదు. పైగా లిథియం బ్యాటరీలు పేలిపోతుందేమో అన్న భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో భద్రతకు భద్రత, కాలుష్యం లేకుండా.. ఛార్జింగ్ తో అస్సలు పని లేకుండా.. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నట్టు.. ఖాళీ గ్యాస్ సిలిండర్ నిచ్చి కొత్త గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్లినట్టు.. ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని ఇచ్చి కొత్త బ్యాటరీని పట్టుకెళ్ళేలా ఒక సరికొత్త బ్యాటరీని అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఆ బ్యాటరీ పేరు అల్యూమినియం ఎయిర్ బ్యాటరీ. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్యాటరీలతో పోలిస్తే ఈ బ్యాటరీ అధిక మైలేజ్ నిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశోధన విభాగం డైరెక్టర్, కంపెనీ బోర్డు సభ్యుడు డాక్టర్ ఎస్ఎస్వీ రామ్ కుమార్ ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ బ్యాటరీల తయారీ కోసం విదేశాల మీద ఆధారపడక్కర్లేదని, దిగుమతులతో పని లేకుండా.. పూర్తిగా స్వదేశంలో దొరికే అల్యూమినియమే ఈ సరికొత్త విప్లవానికి అస్త్రమని ఆయన అన్నారు. ఈ బ్యాటరీకి కరెంటు అవసరం లేదని.. రీఛార్జ్ చేయాల్సిన పని లేదని, పేలుతుందేమో అన్న భయం అస్సలు అవసరం లేదని అన్నారు.
ఛార్జింగ్ తగ్గినప్పుడు పెట్రోల్ బంకులు లేదా అవుట్ లెట్లలో బ్యాటరీ ఇచ్చి.. మరొక బ్యాటరీని కొంత డబ్బు చెల్లించి తీసుకెళ్లవచ్చునని, దీనికి ఎంతో సమయం పట్టదని, నిమిషాల్లో అయిపోతుందని అన్నారు. ఖాళీ వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చి.. ఎలా అయితే ఫిల్ చేసిన గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్తారో.. అలా ఈ ఖాళీ బ్యాటరీ ఇచ్చి.. కొత్త బ్యాటరీని తీసుకెళ్ళవచ్చునని తెలిపారు. అయితే కొనుగోలు చేసినప్పుడు బ్యాటరీ లేకుండా కార్ల కంపెనీలు కార్లను విక్రయిస్తాయని, అయితే బ్యాటరీ కోసం డిపాజిట్ చెల్లించి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వంట గ్యాస్ సిలిండర్ కు డిపాజిట్ చెల్లించినట్లు.. ఈ బ్యాటరీలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని.. అయితే డిపాజిట్ ఎంత? మార్చుకున్న ప్రతిసారి ఎంత చెల్లించాలి? అనేది ఇంకా ఖరారు చేయలేదని అన్నారు.
లిథియం బ్యాటరీ ఖర్చుతో పోలిస్తే.. ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీతో నడిచే వాహన నిర్వహణ ఖర్చు 50 శాతం తగ్గుతుందని అన్నారు. తొలి దశ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీలు 2024 చివరికల్లా అందుబాటులోకి వస్తాయని.. అప్పుడే అల్యూమినియం బ్యాటరీతో నడిచే వాహనాలు కూడా వస్తాయని అన్నారు. మైలేజ్ విషయానికొస్తే.. పరిశోధనలు తుది దశలో ఉన్నాయని.. రీసెంట్ గా మూడు చక్రాల వాహనానికి అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని ఫిక్స్ చేసి నడపగా.. అది 450 కి.మీ. ప్రయాణించిందని అన్నారు. ఇక ఇదే వాహనాన్ని లిథియం బ్యాటరీతో నడిపితే 80 నుంచి 100 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చిందని అన్నారు. అల్యూమినియం ఎయిర్ బ్యాటరీతో నడిచే వాహనాల కోసం.. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
టాటా కార్లకు అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని అమరిస్తే.. 500 కి.మీ. కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలిగే సామర్థ్యాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించామని అన్నారు. మారుతీ, మహీంద్రా కంపెనీలు కూడా ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తున్నాయని, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం లిథియం బ్యాటరీలను అధికంగా.. చైనా, జపాన్, వియత్నాం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే దిగుమతులపై ఆధారపడకుండా.. మన దేశంలో దొరికే సహజ వనరులతో బ్యాటరీని తయారుచేయడంపై చేసిన అధ్యయనంలో అల్యూమినియం కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించినట్లు ఆయన తెలిపారు.
ఆ అల్యూమినియం నిక్షేపాలు మన దేశంలో ఉండడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టపడుతుందని అన్నారు. ఈ విషయం భారత ప్రభుత్వానికి చెబితే సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. లిథియం బ్యాటరీలో ఎనర్జీ డెన్సిటీ కిలోకు 4 కిలోవాట్లు ఉంటే.. అల్యూమినియం బ్యాటరీలో 8 కిలోవాట్లు ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికైతే 4 కిలోవాట్ల ఎనర్జీ డెన్సిటీనే వెలికితీస్తున్నామని.. దీన్ని మరింత మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని అన్నారు. ఇజ్రాయెల్ కు చెందిన ఫినర్జీ అనే అంకుర సంస్థతో కలిసి పరిశోధన చేస్తున్నట్లు వెల్లడించారు. ఎనర్జీ డెన్సిటీ పెరిగే కొద్దీ మైలేజ్ బాగా పెరుగుతుందని.. 6 నుంచి 7 కిలోవాట్లకు ఎనర్జీ డెన్సిటీ పెరిగితే.. మైలేజ్ 800 కిలోమీటర్లు ఇస్తుందని తెలిపారు.
అదే జరిగితే.. వాహన రంగంలో ఇదొక విప్లవం అవుతుందని అన్నారు. ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని వాహనాల్లో ఉపయోగించినప్పుడు అది యాక్టివ్ అల్యూమినియం ట్రైయాక్సయిడ్ గా మారుతుంది. దాన్నుంచి మళ్ళీ అల్యూమినియంను తయారు చేసుకోవచ్చునని అన్నారు. ఈ పునరుత్పత్తి కోసం హిండాల్కోతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. ఇంతకీ ఈ రామ్ కుమార్ ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంకు చెందిన వ్యక్తి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్సెస్సీ కెమిస్ట్రీ చదివారు. ఐఐటీ, రూర్కీ నుంచి డాక్టరేట్ పట్టా పొందిన ఈయన.. 3 దశాబ్దాలకు పైగా అనేక పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. ఈయన హయాంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెయ్యికి పైగా పేటెంట్లు పొందింది.
150కి పైగా పరిశోధన పత్రాలు.. పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ఈయన విదేశాల్లో అనేక సంస్థల్లో బోర్డు సభ్యునిగా, సలహాదారునిగా ఉన్నారు. ఒక తెలుగు వ్యక్తి.. ఇలా దేశ ప్రగతి కోసం ఆలోచించి.. రీసైకిల్ అయ్యే అల్యూమినియంను ఉపయోగించి.. బ్యాటరీ తయారుచేయవచ్చునని తెలుసుకుని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈయన చేస్తున్న పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 2024లో అల్యూమినియం ఎయిర్ బ్యాటరీతో నడిచే కార్లను మనం చూడబోతున్నాం. ఈ అల్యూమినియం కాన్సెప్ట్ ని ద్విచక్ర వాహనాలకు కూడా తీసుకొస్తే బాగుంటుంది కదా. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటి? మరి కరెంటుతో పని లేకుండా.. నడిచే ఈ అల్యూమినియం బ్యాటరీని తీసుకురానున్న ఇండియా, ఇజ్రాయెల్ కంపెనీలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.