స్మార్ట్ ఫోన్ లేకపోతే మనిషికి నిద్ర పట్టదు. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా ఈ స్మార్ట్ ఫోన్ కూడా జీవితంలో ఒక భాగమైపోయింది. కొంతమందికి జీవిత భాగస్వామి ఐపోయిందనుకోండి అది వేరే విషయం. ఇంతలా స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అవ్వడానికి కారణం దాంట్లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్లు. ప్రతి ఏటా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో చాలానే స్మార్ట్ ఫోన్లు వస్తాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే తోపులుగా నిలుస్తాయి. కెమెరా క్వాలిటీ, 5జి టెక్నాలజీ, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ స్పేస్, డిజైన్ వంటి విషయాల్లో రాజీ పడకుండా తయారైన స్మార్ట్ ఫోన్లలో ఐఫోన్ నుంచి రియల్ మీ ఫోన్ వరకూ 10 కంపెనీల ఫోన్లు ఉన్నాయి. మరి 2022లో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకున్న స్మార్ట్ ఫోన్లు ఏంటో ఓ లుక్కేయండి.
విదేశాల సంగతి పక్కన పెడితే భారత్ లో ఐఫోన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఐఫోన్ కి ఉన్న క్రేజ్, దాని మీదున్న మోజు ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్లుగా యాపిల్ కంపెనీ ఫోన్ల మీద విశేషమైన ఆదరణ, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చూపిస్తున్నారు వినియోగదారులు. యాపిల్ కంపెనీ కూడా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫోన్లను తయారుచేస్తుంది. అలా ఈ ఏడాది సెప్టెంబర్ లో యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఫోన్ ఐఫోన్ 14. నాలుగు వేరియెంట్లలో విడుదలైన ఐఫోన్ 14 ని కొనేందుకు భారత్ లోనే కాకుండా విదేశాల్లో కూడా ఆసక్తి చూపించారు. ఏ 15 బయోనిక్ చిప్ ప్రాసెసర్ తో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లు రాగా.. ఏ 16 బయోనిక్ చిప్ ప్రాసెసర్ తో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను తీసుకొచ్చింది యాపిల్ కంపెనీ. బేస్ మోడల్స్ లో 12 మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చితే.. ప్రో మోడల్స్ లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ తో 48 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్లు 5జి సపోర్ట్ చేస్తాయి. మన భారత మార్కెట్లో ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర రూ. 1,29,900, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,39,900 గా ఉన్నాయి. అమెజాన్ లో ఐఫోన్ 14 రూ. 77,490కి, ఐఫోన్ 14 ప్లస్ రూ. 87,490కి లభిస్తున్నాయి.
చాలా కాలం తర్వాత గూగుల్ కంపెనీ గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ తో ఇండియన్ మార్కెట్ లో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో గూగుల్ కంపెనీ రెండు మోడల్స్ ను తీసుకొచ్చింది. ఒకటి గూగుల్ పిక్సెల్ 7 కాగా, మరొకటి గూగుల్ పిక్సెల్ 7 ప్రో. ఈ మోడల్స్ లో గూగుల్ టెన్సర్ జీ2 ప్రాసెసర్ ను అమర్చారు. 50 మెగాపిక్సెల్, 18 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మోడల్స్ వచ్చాయి. ఇక డిస్ప్లే విషయానికొస్తే.. పిక్సెల్ 7లో 6.3 అంగుళాల డిస్ప్లే, పిక్సెల్ 7 ప్రోలో 6.7 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్నాయి. ఇక ధర విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 7 ప్రారంభ ధర రూ. 59,999 ఉండగా.. పిక్సెల్ 7 ప్రో ధర రూ. 84,999గా ఉంది.
ఈ ఏడాది విడుదలైన ఫోన్లలో శాంసంగ్ తయారుచేసిన ఫోల్డబుల్, ఫ్లిపబుల్ ఫోన్లు బెస్ట్ ఫోన్లని చెప్పవచ్చు. శాంసంగ్ కంపెనీ తీసుకొచ్చిన గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 ఫోన్లకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫోల్డ్ 4, ఫ్లిప్ 4 ఫోన్లని అడ్వాన్స్డ్ ఫీచర్లతో తీసుకొచ్చింది. ఈ ఫోన్లలో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ను ఉపయోగించింది కంపెనీ. ఫోల్డ్ 4 ఫోన్ ఫోల్డ్ కండిషన్ లో 6.2 అంగుళాల కవర్ స్క్రీన్ డిస్ప్లే కలిగి ఉండగా.. అన్ ఫోల్డ్ చేస్తే 7.6 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంది. బ్యాక్ కెమెరాల విషయానికొస్తే.. 50 ఎంపీ, 12 ఎంపీ, 10 ఎంపీ కెమెరాలు ఉండగా.. ఫ్రంట్ 10 ఎంపీ కెమెరా.. అన్ ఫోల్డ్ చేసినప్పుడు 4 ఎంపీ అండర్ డిస్ప్లే కెమెరాతో వస్తుంది. ఈ ఫోల్డ్ 4 ఫోన్ ప్రారంభ ధర రూ. 1,54,999. ఇక గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 విషయానికొస్తే.. ఇది 6.7 అంగుళాల హెచ్డీ, డైనమిక్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. ఫోన్ ను మడతపెట్టినప్పుడు నోటిఫికేషన్లు చూసుకునేందుకు 1.9 అంగుళాల అమోలెడ్ కవర్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చారు. ఫోన్ బ్యాక్ సైడ్ రెండు 12 ఎంపీ కెమెరాలు, ఫ్రంట్ సైడ్ 10 ఎంపీ సెల్ఫీ కెమెరాలతో వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 89,999గా కంపెనీ నిర్ణయించింది.
ఈ ఏడాది మొబైల్ ప్రియుల దృష్టిని అధికంగా ఆకర్షించిన ఫోన్లలో ఈ నథింగ్ ఫోన్ ఒకటి. ఇది ఈ ఏడాది జూలై నెలలో రిలీజ్ అయ్యింది. ట్రాన్స్పరెంట్ డిజైన్ తో వచ్చిన ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ లో ఉండే ఎల్ఈడీ లైట్ల కారణంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నోటిఫికేషన్లు, అలర్ట్ మెసేజులు, కాల్స్ వచ్చినప్పుడు సెట్టింగ్స్ కి తగ్గట్టు లైట్లు వెలుగుతాయి. ఇదే అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక డిస్ప్లే విషయానికొస్తే.. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ, ఓఎల్ఈడీ డిస్ప్లే కలిగి ఉంది. ఫోన్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇందులో ఉంది. ఈ ఫోన్ లో స్పాప్ డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్ ను ఉపయోగించారు. రెండు 50 ఎంపీ బ్యాక్ కెమెరాలు, ఒక 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 29,999గా ఉంది.
షావోమీ రిలీజ్ చేసిన మోడల్స్ అన్నిటిలో.. 2022 సెప్టెంబర్ లో విడుదల చేసిన 12 ఎస్ ప్రో ప్రత్యేకంగా నిలిచింది. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ను కలిగి ఉండగా.. 6.73 అంగుళాల 2కే ప్లస్ డిస్ప్లే కలిగి ఉండడం అదనపు ఆకర్షణ. మూడు 50 ఎంపీ బ్యాక్ కెమెరాలు, ఒక 32 ఎంపీ ఇన్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరాని అమర్చారు. ఇది రెండు వేరియెంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 59,999.
వన్ ప్లస్ మోడల్స్ లో ది బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే. ఇది 2022 జూలై నెలలో రిలీజ్ అయ్యింది. 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ప్లస్ అమోలెడ్ డిస్ల్పేతో వచ్చింది. మీడియా టెక్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్ ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడారు. ముందు భాగంలో 32 ఎంపీ అల్ట్రా క్లియర్ కెమెరా అమర్చగా.. వెనుక భాగంలో సోనీ సెన్సార్లతో 50 ఎంపీ కెమెరా, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలను అమర్చారు. రెండు వేరియెంట్లలో వస్తున్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 28,999.
ఐకూ 9టీ 5జీ ఫోన్ ఈ ఏడాది ఆగస్టు నెలలో విడుదలయ్యింది. 20 నిమిషాల్లో వంద శాతం ఛార్జ్ అవ్వడం ఈ ఐకూ 9టీ ఫోన్ ప్రత్యేకత. ఇది లెజెండ్, ఆల్ఫా అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. బీఎండబ్ల్యూ మోటార్ స్పోర్ట్ తో కలిసి ఐకూ ఈ 9టీ 5జి ఫోన్ ని డిజైన్ చేసింది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ని వాడగా.. 6.7 అంగుళాల ఈ5 అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. గేమ్స్ ఆడే వారికోసం, అలానే ఫోటోగ్రఫీ పిచ్చి ఉన్న వారి కోసం అదనంగా ఇందులో వీ1 ప్లస్ చిప్ ను అమర్చారు. 50 ఎంపీ, 12 ఎంపీ బ్యాక్ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ లో వాడారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 49,999.
వివో ఎక్స్ 80 ప్రో ఫోన్ ఈ ఏడాది మే నెలలో రిలీజ్ అయ్యింది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఐకూ 9టీ లానే ఇందులో కూడా గేమింగ్, ఫోటోగ్రఫి కోసం అదనంగా వీ1 ప్లస్ చిప్ ను వాడారు. 6.78 అంగుళాల ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లేతో లభిస్తుంది. జైసిస్ లెన్స్ తో 50 ఎంపీ, 48 ఎంపీ, 8 ఎంపీ బ్యాక్ కెమెరాలు, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ స్పేస్ తో లభిస్తున్న ఈ ఫోన్ ధర రూ. 79,999.
భారత్ మార్కెట్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న బ్రాండ్లలో ఒప్పో ఒకటి. ఇందులో ఈ ఏడాది జూలై నెలలో వచ్చిన ఒప్పో రెనో 8 ప్రో జనాలని బాగా ఆకర్షించింది. ఇందులో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేని అమర్చారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ ను ఇందులో వాడారు. 50 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ బ్యాక్ కెమెరాలు, అలానే 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఇది వస్తుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో లభిస్తున్న ఈ ఫోన్ ధర రూ. 45,999.
రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ ఫోన్ ఫిబ్రవరి నెలలో విడుదల అయ్యింది. ఈ ఫోన్ లో మీడియాటిక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్ ను వాడారు. 6.4 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో లభిస్తుంది. 16 ఎంపీ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా.. 50 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ బ్యాక్ కెమెరాలను ఈ ఫోన్ లో అమర్చారు. దీని పార్రంభ ధర రూ. 24,999.