సినీ తారలకు, క్రీడాకారులకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. మరి వారి అభిమాన ఆటగాడు తమ దగ్గర్లో ఉన్నాడని తెలిస్తే ఉరుకుంటాడా! వెంటనే వెళ్లి అతడిని కలవాలని, అతడితో ఒక పిక్ దిగాలని అను కుంటాడు. తాజాగా యూఏఈ లో అదే జరిగింది. ఓ పాకిస్తానీ యువకుడు తన అభిమాన భారత ఆటగాడితో ఫొటో దిగడానికి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆసియా కప్ కోసం భారత జట్టు యూఏఈ కి వెళ్లింది. ఇక పాక్ తో మ్యాచ్ ఉండటంతో ఇండియా టీమ్ ప్రాక్టీస్ కోసం మైదానానికి బయలుదేరింది. ఈ క్రమంలోనే అక్కడ ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మహమ్మద్ జీబ్రాన్ అనే పాకిస్థాన్ యువకుడు టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని కలవడానికి వచ్చాడు. అతడు విరాట్ తో ఫొటో దిగడానికి ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న సెక్యూరిటీ అతడిని అడ్డుకుంది. ఇదంతా గమనిస్తూనే లోపలికి వెళ్లాడు విరాట్.
అయితే మరి కొంత సమయం తర్వాత కోహ్లీనే స్వయంగా వచ్చి జీబ్రాన్ కి సెల్ఫీ ఇచ్చాడు. అలాగే కోహ్లీ అక్కడే ఉన్న మరికొందరికి కూడా సెల్ఫీలు ఇచ్చాడు. దాంతో జీబ్రాన్ ఆనందానికి హద్దుల్లేవ్. ఫోటో దిగిన తర్వాత అతడిని ఓ మీడియా ప్రశ్నించగా.. జీబ్రాన్ మాట్లాడుతూ.. ” సర్ నేను ప్రపంచంలో ఏ ఆటగాడికి అభిమానిని కాను నేను అభిమానించే ఏకైక క్రికెటర్ ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే. అందుకే మా ఫ్రెండ్స్ విరాట్ సర్ ఇక్కడ ఉన్నాడని చెప్పితే వచ్చాను. విరాట్ భాయ్ ప్రాక్టీస్ చేసి వెళ్తుంటే నేను కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నాను. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది నేను చాలా ఎమోషనల్ అయ్యాను.
అలాగే నాకు రోహిత్ అన్న అంటే కూడా అభిమానమే. అతడి ఆట నచ్చుతుంది. ఇక విరాట్ పాక్ తో మ్యాచ్ లో ఎన్ని పరుగులు చేస్తాడు అని అడగ్గా.. విరాట్ భాయ్ ఆ మ్యాచ్ లో 50+ రన్స్ చేస్తాడు అంటూనే ఈ ఆసియా కప్ లో ఫామ్ లోకి వస్తాడని చెప్పుకొచ్చాడు. అభిమానానికి హద్దులు ఉండవని మరోసారి నిరూపించాడు జీబ్రాన్. ఇతడు పాక్ స్టార్ బ్యాట్స్ మెన్ బాబర్ అజామ్ హోం టౌన్ అయిన లాహోర్ కావడం గమనార్హం. శత్రు దేశం కుర్రాడు అయినప్పటికీ తనకు ఉన్న అభిమానాన్ని చూపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.