దక్షిణాఫ్రికా టీమిండియాపై గెలిచేసింది. కానీ ఆ జట్టు కెప్టెన్ బవుమా గురించి మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే మనోడు బ్యాటర్ గా సరైన ఇన్నింగ్స్ ఆడింది చాలా కాలమైపోయింది. గుర్తుండిపోయే ఫెర్ఫామెన్స్ లు అయితే ఈ మధ్య కాలంలో ఇచ్చింది లేదు. అయినా సరే బవుమాని కెప్టెన్ గా ఎలా ఉంచుతున్నారు? ఇది నాకు కాదు.. చాలామందికి వస్తున్న అతిపెద్ద డౌట్. కానీ దీని వెనక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతుంది? ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏ ఆటలో అయినా సరే ఓ జట్టుకి కెప్టెన్ కావాలంటే చాలా లెక్కలుంటాయి. ఎక్కువ పరుగులు చేస్తున్నాడనో, స్టార్ క్రికెటర్ అని కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పరు. ఇక దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు విషయానికొస్తే.. ప్రస్తుతం కెప్టెన్ గా చేస్తున్న టెంబ బవుమా. సఫారీ జట్టుకు సారథ్య బాధ్యతలు అందుకున్న తొలి నల్ల జాతీయుడు ఇతడు. దేశవాళీలో కెప్టెన్ గా మంచి ఫలితాలు అందుకున్న బవుమా.. గతేడాది టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు కెప్టెన్ అయిపోయాడు. డికాక్.. కెప్టెన్సీ వద్దనడంతో అనుకోకుండా బవుమాని కెప్టెన్సీ వరించింది. ఇక అప్పటినుంచి మనోడే కొనసాగుతూ వస్తున్నాడు.
ఇప్పటివరకు దక్షిణాఫ్రికా కెప్టెన్లుగా చేసిన గ్రేమ్ స్మిత్ (68.75), డుప్లెసిస్ (57.14), ఏబీ డివిలియర్స్ (42.85) కంటే కెప్టెన్ గా బవుమా విజయాల శాతం 75గా ఉంది. సఫారీ జట్టులో ఎప్పటి నుంచో బ్లాక్ అండ్ వైట్ క్రికెటర్లు ఎవరు ఎంతమంది ఉండాలి అనే చర్చ నడుస్తూనే ఉంది. బవుమా వచ్చిన తర్వాత ఈ డిస్కషన్ చాలా వరకు తగ్గింది. జట్టులో సమతూకం వచ్చింది. జట్టులోని ఎంగిడి, రబాడా లాంటి నల్ల జాతీయులు అద్భుతంగా ఆడుతున్నారు. ఇలా ఆటగాడిగా బవుమా విఫలమవుతున్నా సరే కెప్టెన్ గా మాత్రం అందరినీ మేనేజ్ చేస్తూ బెస్ట్ ఇస్తున్నాడు. క్రికెట్ అభిమానులు మాత్రం బవుమాపై విమర్శలు చేస్తున్నారు. ఇక కెప్టెన్ గా టీమిండియాపైనా సాధించిన తాజా విజయంతో బవుమా ఏంటో అందరికీ తెలిసింది.
nbsp;