ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా మారింది. సెమీస్ వెళ్లాలంటే ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లంక విజయంపై ఆధారపడ్డ ఆసిస్ కు భంగపాటు తప్పలేదు. ఇక ఆదివారం సూపర్ 12 లో భాగంగా మరో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా-జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. సంచలన ప్రదర్శన ఇస్తున్న జింబాబ్వే టీమిండియాను కలవర పెడుతుందనే చెప్పాలి. ఒక్క పరుగుతో పాక్ ను ఓడించి ఒక్కసారిగా వరల్డ్ కప్ సెమీస్ బెర్త్ లను అతలాకుతలం చేసింది. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే జింబాబ్వేను తక్కువ అంచనా వేయటం లేదు అంటున్నాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. చిన్న జట్టు అయినప్పటికీ జింబాబ్వే అద్భుత టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తుందని ప్రశంసించాడు. ఇక అవసరం అయితే ఈ మ్యాచ్ లో మన్కడింగ్ చేస్తానని ముందే పసికూన బ్యాటర్లను హెచ్చరించాడు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం టీమిండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విలేకర్లతో ముచ్చటించాడు. మ్యాచ్ గురించి వివరాలు వెల్లడిస్తూ..”జింబాబ్వే చిన్న టీమ్ అయినప్పటికీ ఈ వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. దాంతో మేం ఆ జట్టును తక్కువగా అంచనా వేయట్లేదు. సికిందర్ రజా గొప్పగా ఆడుతున్నాడు, ఈ మ్యాచ్ లో అతడు కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. అందుకే మేం ఈ మ్యాచ్ ను సీరియస్ గానే తీసుకుంటాం” అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక ఓ రిపోర్టర్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ మన్కడింగ్ విషయం గురించి చెప్పండి అని అడగ్గా.. నవ్వుతూ సమాధానం చెప్పాడు. చాలా మంది ఇలా అవుట్ చేయడం సరికాదని బయట వాగుతూ ఉంటారని అశ్విన్ మండిపడ్డాడు.
ఈ క్రమంలోనే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండి రనౌట్ అవ్వాలని ఎవరూ అనుకోరని అశ్విన్ తెలిపాడు. ఇక ఆటగాళ్లను ఎల్బీ చేయడం, క్యాచ్ అవుట్ చేయడం, వికెట్ తీయ్యడం లాంటివి నాకు నచ్చవు అని అశ్విన్ బాహటంగానే చెప్పాడు. ఇక నాన్ స్ట్రైకర్ గా ఉండి మన్కడింగ్ తో రనౌట్ అవ్వడానికి నేను ఎంత మాత్రం ఇష్టపడను అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో సైతం అవసరమైతే మన్కడింగ్ ను వాడుతా అని ముందే ప్రత్యర్థి బ్యాటర్లను హెచ్చరించాడు. ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు అశ్విన్. 4 మ్యాచ్ ల్లో 8.15 ఎకానమీతో కేవలం 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇప్పటి నుంచి టీమిండియా ఆడబోయే ప్రతీ మ్యాచ్ కీలకమే కాబట్టి.. అశ్విన్ ఫామ్ లోకి రావడం టీమిండియాకు కీలకం.