సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు.. ఇరు జట్ల కెప్టెన్ లు ప్రెస్ మీట్ నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ప్రెస్ మీట్ లో సారథులు జట్టులో ఏమైనా మర్పులు ఉంటే తెలియజేస్తారు. ఇక తమ వ్యూహాల గురించి చెప్పి ప్రత్యర్థికి భయం తెప్పించాలని చూస్తారు. ఈ క్రమంలో రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు సైతం సమాధానాలు ఇస్తారు. ఇక ఆదివారం టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్-పాక్ మధ్య జరగబోతోంది. ఈ సందర్బంగా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బాబర్ గటకలు మింగితూ.. పాక్ మీడియా మేనేజర్ వైపు చూసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇంగ్లాండ్ – పాకిస్థాన్ లు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారం తలపడనున్నాయి. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బాబర్ కు చుక్కలు చూపించాడు ఓ రిపోర్టర్.”పాక్ జట్టు ఐపీఎల్ లో ఆడాలని చర్చ జరిగింది. అది మీ జట్టుకు సహాయపడుతుందని భావిస్తున్నారా? ఫ్యూచర్ లో IPL ఆడుతారా? అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక బాబర్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అని ఎదురు చూసిన విలేకర్లకు.. సమాధానం కంటే ఎక్కువే మజాని ఇచ్చే సంఘటన దొరికింది. ఈ ప్రశ్నకు బాబర్ సమాధానం చెప్పలేక మీడియా మేనేజర్ వైపు దీనంగా చూశాడు. దాంతో ఆ ప్రశ్నకు మేనేజరే సమాధానం చెప్పాడు. మీరు ప్రపంచ కప్ గురించే ప్రశ్నలు అడగాలి. మేం వాటికి మాత్రమే సమాధానం ఇస్తాం అని బదులిచ్చాడు.
— Guess Karo (@KuchNahiUkhada) November 12, 2022
ఇక ఫైనల్ మ్యాచ్ లో ఒత్తిడి పై బాబర్ మాట్లాడుతూ..”కొన్ని మ్యాచ్ ల నుంచి మా ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇక మా బౌలింగ్ రాను రాను పటిష్టంగా మారిందనడంలో సందేహం లేదు. ఫైనల్ మ్యాచ్ అన్నాక ఒత్తిడి సహజంగానే ఉంటుంది. మాపై మాకు నమ్మకం ఉంది.. ఆ నమ్మకంతోనే ఒత్తిడిని జయిస్తాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబర్ మేనేజర్ వైపు చూసిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో బాబర్ పై సెటైర్లు పేలుతున్నాయి. మీరంతా పెయిడ్ ఆర్టిస్టులా? రాసింది రాసినట్టు.. చెప్పింది చెప్పినట్లు రిపోర్టర్లకు అప్పజెప్పమని మీ మేనేజర్ చెప్పారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న చిన్న ప్రశ్నలకు కూడా మీడియా మేనేజర్ వైపు చూడటం ఏంటని సెటైర్లు వేస్తున్నారు.