సూర్యకుమార్ యాదవ్ అలియాస్ SKY.. ఇప్పుడే కాదు గత కొంతకాలంగా క్రికెట్ ప్రపంచాన్ని తన భీకర ఫామ్‌తో ఊపేస్తున్నాడనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నాడు అంటే మ్యాచ్ ఇంకా మన చేతుల్లోనే ఉంది అనే భరోసా కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే తన సక్సెస్ వెనుక ఉన్నది దేవీషా అంటూ చెబుతుంటాడు. అయితే వారి బంధం ఎలా మొదలైంది? ఎన్ని ట్విస్టులు ఉన్నాయో చూడండి.
సూర్యకుమార్ ముంబయిలోని ఆర్.ఏ పోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సూర్యాకి పుస్తకాలు, క్లాస్ రూమ్లు కంటే బ్యాటు, బాల్ తోనే ఎక్కువ సాన్నిహిత్యం. క్లాస్ లో కంటే గ్రౌండ్ లోనే ఎక్కువ గడిపేవాడు. దేవీషా శెట్టి అప్పుడే ఇంటర్ పూర్తి చేసుకుని అదే కళాశాలలో చేరింది. ఫ్రెషెస్ డే రోజు దేవీషా డాన్స్ చూసి సూర్యా క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. యాథృచ్చికమో ఏమో గ్రౌండ్ లో సూర్యా హిట్టింగ్ చూసి దేవీషా ఫ్లాట్ అయిపోయింది.
కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్ ద్వారా దేవీషాని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కాలేజ్ బయట, క్యాంటీన్లో కలవడం షురూ చేశారు. అలా నాలుగేళ్లు విచ్చలవిడిగా ప్రేమించేసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించినా అంత గుర్తింపు రాలేదు. 2012లోనే ఐపీఎల్ లో అడుగుపెట్టినా.. 2015 వరకు సరైన గుర్తింపు రాలేదు. ఆ ఏడాది ముంబయితో జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో 46 పరుగులు చేసి.. టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు.
ఆ తర్వాతి సంవత్సరమే సూర్యా- దేవీషా పెళ్లిపీటలు ఎక్కేశారు. 2016 జులై 7న దక్షిణాది సంప్రదాయంలో వారి పెళ్లి జరిగింది. బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ తన లవ్, సక్సెస్ సీక్రెట్ ని రివీల్ చేశాడు. “పెళ్లి తర్వాత ఓరోజు క్రికెట్ లో తనకి ఎదురైన కష్టాలను దేవీషాతో పంచుకునే ప్రయత్నం చేశాను. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, బుమ్రాతో కలిసి ఆడాను. వాళ్లంతా టీమిండియాకి ప్రాతినిధ్యం వహిస్తుంటే నేను మాత్రం అంటూ చెప్పబోతున్నాను. దేవీషా నా మాటలను అడ్డుకుని.. ‘నువ్వు అన్ని అడ్డంకులు, ఆటంకాల గురించి మర్చిపోయి ముందు క్రికెట్ మీద దృష్టి పెట్టు’ అని దేవీషా చెప్పింది” అంటూ సూర్య చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచే అందరికీ సూర్యా 2.0 సినిమా చూపిస్తున్నాడు.
చాలా ఎదురుచూపుల తర్వాత సూర్యకుమార్ యాదవ్ కు 2021లో ఇంగ్లాండ్ పై టీ20ల్లో అవకాశం దక్కింది. మ్యాచ్ రోజు ఉదయం 4 గంటలకు “నీ పదేళ్ల నిజమైన క్రికెట్ ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. ఇది ముగింపు కాకూడదు” అని దేవీషా చెప్పిందన్నాడు. ఆ తర్వాత టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ సాధించిన, సాధిస్తున్న విజయాలు, నమోదు చేస్తున్న రికార్డులు అందరికీ తెలిసిందే. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో 44 స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకున్నాడు. అలా తన సక్సెస్ సీక్రెట్ తన భార్య దేవీషా శెట్టి అంటూ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.