భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అయిన షాహిద్ అఫ్రిదీని దారుణంగా ట్రోల్ చేశాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా మిస్టర్ ఐపీఎల్ అఫ్రిదీని ట్రోల్ చేశాడు.
క్రికెట్ లో ఒక్కసారి రిటైర్మెంట్ ప్రకటిస్తే.. వారిని దాదాపుగా మనం మళ్ళీ మైదానంలో చూసే అవకాశం ఉండదు. కానీ ఫ్యాన్స్ నుంచి మాత్రం రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు బాగా వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో అరుదులో అరుదుగా కొంతమంది ప్లేయర్లు తమ రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెడతారు. వీరు తొందరపడి రిటైర్మెంట్ ప్రకటిస్తారో.. లేకపోతే ఫ్యాన్స్ కోసం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో తెలియదు గాని మరోసారి గ్రౌండ్ లో కనిపించి అందరికి షాక్ ఇస్తారు. అయితే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిదీ మాత్రం ఆశ్చర్యకరంగా మూడు సార్లు అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పి.. మళ్ళీ క్రికెట్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోపోయినా.. తాజాగా భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా.. అఫ్రిదీ రిటైర్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియా మహారాజస్, ఆసియన్ లయన్స్, వరల్డ్ జయింట్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియన్ మహారాజస్ పై వరల్డ్ జయింట్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ మహరాజస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. 49 పరుగులతో సురేష్ రైనా టాప్ స్కోరర్ గా నిలిచి సత్తా చాటాడు. దీంతో మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో “మీరు బాగా ఆడుతున్నారు. అందరూ మరోసారి మిమ్మల్ని ఐపీఎల్లో చూడాలనుకుంటున్నారు. మళ్ళీ మీరు ఐపీఎల్లో కనబడే అవకాశం ఉందా?” అని విలేఖరి అడిగాడు. దీనికి రైనా నవ్వుతూ.. “నేను ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించేసాను. నా పేరు సురేష్ రైనా.. ఆఫ్రిదీ కాదు” అని ఒక ముక్కలో తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవట్లేదని చెప్పేసాడు.
ఇక పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అఫ్రిదీ ఇప్పటికే మూడు సార్లు తన రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రైనా..అఫ్రిదీ విషయంలో ఇలా మాట్లాడడం కాస్త ఆశ్చర్యకరంగానే అనిపించింది. అయితే రైనా సరదాగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఇండియన్ మహరాజస్ నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వరల్డ్ జయింట్స్ ఆడిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో టాప్ ప్లేస్ లో ఉండగా..ఆసియన్ లయన్స్ కూడా రెండు విజయాలతో రెండవ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు గంభీర్-అఫ్రిదీ మధ్య వివాదాలు ఏ రేంజ్ లో ఉండేవే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైనా.. అఫ్రిదీని ఉద్దేశించి రిటైర్మెంట్ విషయంలో సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఎక్కడివరకు వెళ్తాయో చూడాలి మరి.
‘Suresh Raina Hu, Shahid Afridi Nahin’
Hilarious Reply From Mr. IPL 😄@ImRaina #legendsleaguecricket #LLC2023 pic.twitter.com/GpV9uEa0wx
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) March 15, 2023