ఏ క్షణాన భారతదేశం IPL టోర్నీని ప్రారంభించిందో.. అప్పటి నుంచి వరల్డ్ క్రికెట్ చరిత్ర మారిందనే చెప్పాలి. ఐపీఎల్ టోర్నీని చూసి చాలా దేశాలు ఇప్పటికే తమతమ దేశాల్లో టీ20లను, టీ10 టోర్నీలను ప్రారంభించాయి. తాజాగా మరో దేశం టీ20 లీగ్ కు తెరలేపనుంది. యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ తొలి సీజన్ ను వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీల పుణ్యమాని ఎంతో మంది టాలెంటెడ్ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్ గా విండిస్ స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ నియమితుడయ్యాడు.
సునీల్ నరైన్.. మిస్టరీ బౌలర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంలో నరైన్ సిద్దహస్తుడు. ఇక అతడి బ్యాటింగ్ విధ్వంసం వెలుగు చూసింది మాత్రం IPL లోనే. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు కు ప్రాతినిధ్యం వహిస్తున్న నరైన్ ఓపెనర్ గా తన బ్యాటింగ్ విధ్వంసాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. కాగా త్వరలో ప్రారంభం కానున్న యూఏఈ టీ20 లీగ్ లో అబుదాబి నైట్ రైడర్స్ ప్రాంఛైజీని ఐపీఎల్ జట్టు కోల్ కత్తా నైట్ రైడర్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. దాంతో అబుదాబి నైట్ రైడర్స్ జట్టు పగ్గాలను సునీల్ నరైన్ కు అప్పగించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ గా ఎంపికైన అనంతరం సునీల్ నరైన్ స్పందించాడు.
“నాకు ఇది ఒక కొత్త సవాల్. అయితే సారథిగా పగ్గాలు చేపట్టడానికి నేను ఎప్పటికీ సిద్దంగానే ఉంటాను. ఇక నేను ఇప్పుడు నా బ్యాటింగ్, బౌలింగ్ తో పాటుగా జట్టు మెుత్తంపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. నాకు నైట్ రైడర్స్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. అబుదాబిని విన్నర్ గా చేయడానికి నా శక్తి సామర్థ్యాలను అన్నింటిని వినియోగిస్తాను” అని నరైన్ పేర్కొన్నాడు. అదీకాక యూఏఈ పిచ్ లపై ఆడిన అనుభవం ఉండటం నాకు కలిసివచ్చే అంశంగా సునీల్ నరైన్ చెప్పుకొచ్చాడు. నరైన్ కు 400 టీ20 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉండటం.. అబుదాబి నైట్ రైడర్స్ జట్టుకు టైటిల్ గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.