పట్టుదల, ప్రతిభ ఉంటే ఎదుగుదలకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ కేఎం ఆసిఫ్. కుటుంబ బాధ్యతలు దుబాయ్‌లో పనిచేయమని భారం మోపితే.. క్రికెటర్ అవ్వలనే తన కల అదే దుబాయ్ క్రికెట్ మైదానాల్లో 11 మంది జట్టు సభ్యుల్లో కాలు మోపేలా చేసింది. 2018 నుంచి సీఎస్‌కేకు ఆడుతున్నా, తనని తాను ఇంకా పూర్తిగా నిరూపించుకోలేకపోయినా.. ఆసిఫ్ ప్రస్థానం అసామాన్యం. ఒక చిరుద్యోగి స్థాయి నుంచి ప్రపంచలోనే అత్యంత పాపులర్ క్రికెట్ లీగ్‌లో ధోని లాంటి అద్భుత ఆటగాళ్లతో కలిసి ఆడే రేంజ్‌కు రావడం అంత ఈజీ కాదు. కానీ ఆసిఫ దాన్ని సాధించిచూపించాడు. ఆసిఫ్ తండ్రి రోజువారీ కూలీ. తల్లి గృహిణి, సోదరుడు అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. సోదరికి బ్రెన్ ట్యూమర్ ఆపరేషన్ చేయించాలి. వర్షం వస్తే ఇల్లు కురుస్తుంది. వాళ్లది కేరళ కనుక వర్షం వాళ్ల జీవితంలో భాగమైంది.
ఇలా పాత సినిమాల్లో హీరోకు ఉండే కష్టాలన్ని ఆసిఫ్‌కు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం డబ్బు. దాని కోసం ఆసిఫ్ దుబాయ్‌లో ఉద్యోగానికి బయలుదేరాడు. ఒక బాటిళ్ల తయారీ కంపెనీలో స్టోర్ కీపర్‌గా ఉద్యోగం. క్రికెటర్ అవ్వాలనే బలమైన కోరిక మనసులో మెదులుతూనే ఉంది. ఉండబట్టలేక కొన్ని రోజులకు బ్యాగ్ సర్దుకుని కేరళకు వచ్చేశాడు. వాయనాడ్ జిల్లాలో జరుగుతున్న బౌలర్ల ఎంపికకు వెళ్లాడు. అక్కడ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జెఫ్ థాంసన్ దృష్టిలో పట్టాడు. ఆ ఎంపికలో సార్ట్‌లిస్ట్ కూడా అయ్యాడు. కానీ కేరళ జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ దుబాయ్ విమానం ఎక్కాల్సి వచ్చింది. విజిటింగ్ విసాపై దుబాయ్ వెళ్లిన ఆసిఫ్ జీవితంలోకి అనుకోకుండా మళ్లీ క్రికెట్ వచ్చింది. దుబాయ్ జాతీయ జట్టు ఎంపిక సమయంలో ఆసిఫ్ ప్రతిభను గుర్తించిన కోచ్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ అతనికి ఒక ఉద్యోగం ఇప్పించాడు. కాగా గతంలో ఒక సారి దుబాయ్ వచ్చి కాంట్రాక్ట్ పూర్తి కాకుండే ఇండియా వెళ్లిపోవడంతో అతనిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడడంతో అతనికి ఆ ఉద్యోగం రాలేదు. దీంతో తనకు తెలిసిన క్రికెట్‌పైనే దృష్టిపెట్టి ఏదో ఒకటి చేయాలని మళ్లీ స్వదేశం వచ్చాడు. పట్టుదలతో బౌలింగ్ సాధన చేశాడు. అతను పడ్డ కష్టానికి ఫలితంగా ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం కేరళ జట్టులో స్థానం పొందాడు.
ఆ సమయంలో ఎల్ శివరామకృష్ణణ్ ఆసిఫ్ ప్రదర్శనతో ఇంప్రెస్ అయి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రిఫర్ చేశాడు. దాంతో 2018లో సీఎస్‌కే 40 లక్షలకు వేలంలో కొనుగోలు చేసింది. అదే ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆసిఫ్ 3 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు తీశాడు. 2018 నుంచి సీఎస్‌కే జట్టులో కొనసాగుతున్నాడు. మ్యాచ్ జరిగే సమయంలో నువ్వు టెన్నిస్ బాల్‌తో అద్భుతంగా బౌలింగ్ చేస్తావని నాకు తెలిసింది. దీన్నికూడా టెన్నిస్ బాల్ అనుకో.. బాగా స్పీడ్‌గా వేయి.. రన్స్ పోతున్నాయని ఆలోచించకు అని షేన్ వాట్సన్ తనతో చెప్పిన మాటలు తనలో ఒత్తిడి తగ్గించాయని, అలాగే కెప్టెన్ ధోని తన భుజంపై చేయి వేసి నువ్వు నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చిన ఏం కాదు. ఇదీ నీ చాన్స్ అని చెప్పి తనను ప్రోత్సహించినట్లు ఆసిఫ్ మీడియాతో తెలిపాడు.
ఒక పేద కుటుంబంలో పుట్టి.. బతుకుదెరువు కోసం దేశం కానీ దేశం వెళ్లి ఇప్పుడు అదే దేశంలో ప్రపంచ మేటి ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఆసిఫ్ లైఫ్‌స్టోరీ ఎందరికో స్ఫూర్తి దాయకం. అతను అద్భుత ప్రదర్శన కనబర్చి జాతీయ జట్టులో కూడా ఆడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మరీ ఆసిఫ్ ప్రయాణంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.