పుష్కర కాలం తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. టీమిండియా కసరత్తులు ప్రారంభించేసింది. మెగాటోర్నీలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు తప్పవని అనిపిస్తోంది. ఒకప్పుడు మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్ తిరిగి అదే స్థానంలో బరిలోకి దిగుతాడా చూడాలి.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ కొత్త ప్లాన్ లు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ప్రపంచకప్ వరకు జట్టులో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ సేవలు ప్రస్తుతం అందుబాటు లో లేకపోవడంతో.. మ్యాచ్ లు ఫినిష్ చేసే బాధ్యత మరో సీనియర్ బ్యాటర్ కు ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. టాపార్డర్ లోనే బరిలోకి దిగుతున్నారు. దీనికి బదులు.. ఒకరిని పైనే ఉంచి.. మరొకరిని మిడిలార్డర్ కు పంపాలనే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. వెస్టిండీస్ తో తొలి వన్డే చూసిన వారికి ఇది ఈ పాటికే స్పష్టమై ఉంటుంది. మ్యాచ్ ఫినిషర్ లేకపోతే కష్టమని భావిస్తున్న బోర్డు.. రోహిత్ కు ఆ బాధ్యత అప్పగిస్తుందా అంటే.. అవుననే సమాధానమే వస్తున్నది.
కెరీర్ తొలి నాళ్లలో మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసిన అనుభవమున్న రోహిత్ శర్మ కు తిరిగి ఆ బాధ్యత అప్పగించాలని భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో శుభ్ మన్ గిల్ జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయం కాగా.. అతడితో పాటు మరో యువ ఆటగాడిని ఓపెనర్ గా పంపాలని చూస్తోంది. వారిద్దరిలో ఒకరు ఔటైనా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉంటాడు కాబట్టి పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉంటుంది. ఇక మిడిలార్డర్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా.. ఓ సినీయర్ బ్యాటర్ ఉంటే మంచిదని బోర్డు యోచిస్తోంది. చాన్నాళ్ల పాటు భారత జట్టుకు ఫినిషర్ గా సేవలందించిన మహేంద్ర సింగ్ ధోనీ 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ పరాజయం అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచి హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఫినిషర్ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్న బోర్డు.. సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అందుబాటులో ఉన్నా.. నిలకడగా ఆడగలిగే సత్తా ఉన్న రోహిత్ ను అక్కడ ఆడించాలని చూస్తోంది. గత వరల్డ్ కప్ లో నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేకే.. భారత జట్టు ఓటమి పాలైందని ప్రతి ఒక్కరు బలంగా నమ్ముతున్న వేళ.. ఈ మార్పు తథ్యమే అనిపిస్తోంది. 2011 భారత్ లో జరిగిన వన్డే ప్రపంచకప్ ను పరిశీలించినా.. ఇదే స్పష్టమవుతోంది. ఓపెనింగ్ లో సచిన్ దంచికొడితే.. మిడిలార్డర్ లో యువరాజ్ సింగ్, ధోనీ కలిసి మ్యాచ్ లు ముగించారు. ఈ సారి కూడా అలాంటి కాంబినేషనే ప్రయత్నించే అవకాశాలున్నాయి. రోహిత్ ను మిడిలార్డర్ కు పంపితే.. టాప్ లో విరాట్.. మిడిల్ లో రోహిత్ మ్యాచ్లను ముగించే అవకాశఆలు పెరుగుతాయి.
అయితే ప్రపంచకప్ ప్రారంభానికి రెండున్నర నెలలు కూడా గడువు లేకపోగా.. ఈ సమయంలో మేనేజ్ మెంట్ ప్రయోగాలను కొనసాగిస్తుందా అనేది కూడా అనుమానమే.. చాన్నాళ్లుగా రోహిత్ ఓపెనర్ గానే దంచికొడుతున్నాడు. విభిన్న ప్రయోగాలకు తెరతీసి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టడం వద్దనుకుంటే.. ప్రస్తుతం ఉన్న కాంబినేషన్ నే కొనసాగించవచ్చు.