ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బాల్ ట్యాంపరింగ్ చేశాడంటూ ఆసీస్ మీడియా విమర్శలు చేస్తోంది. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ కూడా జడ్డూను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఘాటుగా స్పందించాడు.
నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు టీమిండియా అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 177 రన్స్‌కే ఆలౌట్ చేసింది. గాయం తర్వాత పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఆసీస్ వెన్నువిరిచాడు. మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. పేసర్లు షమి, సిరాజ్ చెరో వికెట్‌తో మంచి సహకారం అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి రోజు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 77 రన్స్ చేసింది. రెండో రోజు ఆట మొదలైంది. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ కోల్పోయి 135 రన్స్ చేసింది. రోహిత్ (81 నాటౌట్), కోహ్లీ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్నర్లకు దెబ్బకు చేతులెత్తేసిన ఆస్ట్రేలియా.. భారత్‌పై విషం చిమ్మడం మొదలుపెట్టింది. ఆ దేశ మీడియా జడేజాను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. మ్యాచ్ సందర్భంగా జడ్డూ తన చేతి వేళ్లకు ఏదో రాసుకున్నాడని ఆ కథనంలో రాసుకొచ్చింది. టీమిండియా బాల్ ట్యాంపరింగ్ చేసిందని పేర్కొంది. అసలు విషయంలోకి వస్తే.. ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లు ముగిసేసరికి 120/5 స్కోరుతో ఉంది. అప్పటికే జడేజా 3 వికెట్లు తీశాడు. 46వ ఓవర్ వేసే ముందు సిరాజ్ దగ్గరకు జడేజా వెళ్లాడు. సిరాజ్ వద్ద నుంచి ఆయింట్‌మెంట్ లాంటిదాన్ని తన చేతి వేలికి రాసుకున్నాడు. దీనినే ట్యాంపరింగ్ చేశారనే అర్థం వచ్చేలా ఆసీష్ మీడియా విమర్శలు చేస్తూ కథనాలు రాసింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా ఇలాంటి ఘటనను తానెప్పుడూ చూడలేదంటూ భారత్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాడు. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. వాన్ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టాడు.
‘నేను దీని గురించి ఎక్కువగా వినలేదు. అయితే రెండు ప్రశ్నలు మాత్రం అడగాలనుకుంటున్నా. ఈ అంశంలో ఆస్ట్రేలియా టీమ్‌కు ఎలాంటి సమస్య ఉన్నట్లు కనిపించడం లేదు. మ్యాచ్ రిఫరీ కూడా ఇందులో జోక్యం చేసుకోలేదు. కాబట్టి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్లేయర్లు ఆయింట్‌మెంట్ రాసుకుంటే తప్పేంటి? ఒకవేళ అందులో ఎలాంటి ఆక్షేపణ ఉన్నా మ్యాచ్ రిఫరీ కలుగజేసుకునేవాడు. ఏదైనా తప్పు చేస్తే చర్యలు తీసుకునేవాడు. అయినా, బంతి గింగిరాలు తిరుగుతున్న ఈ ట్రాక్‌పై వికెట్లు తీయడానికి ప్రత్యేకంగా ఏదీ చేయనవసరం లేదు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇందులో జడ్డూ తప్పు ఎంతమాత్రం లేదంటూ పరోక్షంగా అండగా నిలిచాడు. ఈ వివాదానికి ఇంతటితో ఎండ్‌కార్డ్ పడుతుందేమో చూడాలి. మరి, ఆయింట్‌మెంట్ రాసుకుంటే బాల్ ట్యాంపరింగ్ చేశారంటూ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆసీస్ మీడియాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.