టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది. కానీ ఇంతలోపే జట్టును గాయాలు దెబ్బతీశాయి. ఈ గాయాలు కాస్తా విమర్శకుల నోటికి పనిచెప్పాయి. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా సైతం టీ20 వరల్డ్ కప్ కు అందుబాటులో ఉండటం లేదని తేలింది. దాంతో ఈ జట్టుతో టీమిండియా టీ20 కప్ గెలవడం కష్టమే అంటూ.. విమర్శించడం మెుదలు పెట్టారు. అందుకు తగ్గట్లుగానే భారత బౌలింగ్ కూడా తాజాగా జరుగుతున్న మ్యాచ్ ల్లో తేలిపోతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా స్టార్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ భారత జట్టుపై, బుమ్రాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బుమ్రా.. ఇప్పుడు క్రీడా ప్రపంచంలో మార్మోగిపోతున్న పేరు. దానికి కారణం అతడు వెన్ను నొప్పి గాయంతో టీ20 ప్రపంచ కప్ నుంచి వెనుదిరగడమే. బుమ్రా లేకపోవడం భారత్ కు పెద్ద దెబ్బే అని ఆసిస్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ అన్నాడు. తాజాగా ఎన్డీటీవితో మాట్లాడిన అతడు బుమ్రా పై ఈ విధంగా స్పందించాడు.”బుమ్రా టీమిండియా జట్టులో లేకపోతే కచ్చితంగా జట్టు నష్టపోతుంది. అదీ కాక టీ20 ప్రపంచ కప్ భారత్ గెలవడం కూడా అసాధ్యమే. ఎందుకుంటే అలాంటి అటాకింగ్ బౌలర్ ప్రపంచంలోనే లేడు” అంటూ బుమ్రాను ప్రశంసించాడు. “ఇక అతడు లేకుండా టీమిండియా ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీని ఆడటం సవాల్ తో కూడుకున్నదే.
అయితే బుమ్రాతో పాటు మీగతా బౌలర్లు కూడా తమ పాత్రను తాము నిర్వర్తిస్తేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయని” షేన్ వాట్సన్ అన్నాడు. అయితే తాజాగా గంగూలీ మాత్రం.. బుమ్రా ఇంకా టీ20 ప్రపంచ కప్ నుంచి దూరం కాలేదని వెల్లడించాడు. అయినప్పటికీ క్రికెట్ అభిమానులకు బుమ్రా ఆడటం అనుమానంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్ అకాడమిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాతనే జట్టులోకి వస్తాడని క్రికెట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే షేన్ వాట్సన్ లాంటి స్టార్ ఆటగాళ్లు సైతం.. బుమ్రా లోటును గుర్తించడం ఆలోచించాల్సిన విషయం. ఇక బుమ్రా అందుబాటులోకి రాకపోతే సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, షమిలలో ఎవరో ఒకర్ని తీసుకునే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోంది.