వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో భారత ఓటమికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా సారథ్యమే అని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు దానికి బలం చేకూర్చేలా విండీస్ హిట్టర్ పూరన్ ఏమన్నాడంటే..
చేతిలోకి వచ్చిన మ్యాచ్ ను పోగొట్టుకొని టీ20 సిరీస్ లో వెనుకబడ్డ టీమిండియాపై విమర్శ జడి ఆగడం లేదు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గెలువాల్సిన మ్యచ్ లో ఓటమి పాలవడానికి హార్దిక్ కెప్టెన్సీనే కారణమని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లుతున్నాయి. ధాటిగా ఆడి అర్ధశతకంతో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పూరన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. ఆ సమయంలో కామెంటేటర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు.
19వ ఓవర్ యుజ్వేంద్ర చాహల్ వేయకపోవడం మిమ్మల్ని ఆశ్చర్య పరించిందా అని కామెంటేటర్ ప్రశ్నించగా.. ‘మ్యాచ్ లో అది ఎంతో కీలక సమయం.. అప్పుడు గనక చాహల్ 19వ ఓవర్ బౌలింగ్ చేసుంటే తప్పక భారత జట్టు మ్యాచ్ గెలిచి ఉండేది. మాకు అవకాశమే దక్కేది కాదు’ అని పూరన్ అన్నాడు. ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రత్యర్థి ప్లేయర్లకు కూడా అర్థమైపోయింది కానీ.. మా సారథి కి మాత్ర అర్థం కాలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో పాండ్యా తన ఓవర్ కాన్ఫడెన్స్ కామెంట్స్ తోనూ విమర్శల పాలవుతున్నాడు. భారత జట్టు రెండుగా విడిపోయినా.. ప్రపంచంలోని ఏ జట్టునైనా సునాయాసంగా ఓడించగలమని బీరాలు పలికిన పాండ్యా.. ఈ సిరీస్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
రెండో మ్యాచ్ లో భారత్ పెద్ద టార్గెట్ సెట్ చేయకపోయినా.. హార్దిక్ తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీయడంతో పాటు అర్ష్ దీప్ కూడా ఓ వికెట్ పడగొట్టడంతో ఈ సారి గెలుపు మనదే అనే దీమా అనిపించింది. అయితే.. పవర్ ప్లే లో రవి బిష్ణోయ్ కు బంతి అప్పగించడంతో కరీబియన్లు జూలు విదిల్చారు. అప్పటి వరకు ఓ మోస్తరు వేగంతో ఆడుతున్న విండీస్ ప్లేయర్లు.. దంచికొట్టి ఇన్నింగ్స్ కు మెరుగైన పునాది వేశారు. ఇక చివర్లో చాహల్ మరోసారి అవకాశాలు కల్పించినా.. వాటిని జట్టు పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. తనను తాను ధోనీ వారసుడినని చెప్పుకునే పాండ్యా మాత్రం.. కెప్టెన్సీలో దారుణంగా విఫలమవుతున్నాడు. అంత అతి విశ్వాసం పనికిరాదని విమర్శకులు విరుచుకుపడుతున్నారు.