ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ.. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్యాప్సీ (సారథి) నుంచి మెసెజ్ వస్తే.. వెంటనే డిలీట్ చేశేస్తానని పేర్కొన్నాడు.
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ముగియగా.. ఇంగ్లండ్ జట్టులో రిటైర్మెంట్ ల పర్వం కొనసాగుతోంది. సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఐదో టెస్టుతో ఆటకు వీడ్కోలు పలకగా.. ఇప్పుడు అదే బాటలో మోయిన్ అలీ పయనిస్తున్నాడు. గతంలోనే టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అలీ.. కెప్టెన్ బెన్ స్టోక్స్ అభ్యర్థన మేరకే ఈ యాషెస్ సిరీస్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి తన నిర్ణయంపై యూ టర్న్ తీసుకునే ఉద్దేశమే లేదని మోయిన్ అలీ కుండబద్దలు కొట్టాడు. ఇక మరో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాత్రం.. తాను దేశానికి చేసేది ఇంకా మిగిలే ఉందని.. ఇప్పుడప్పుడే వీడ్కోలు నిర్ణయం తీసుకోనని ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ జట్టు తరఫున ప్రధాన బౌలర్ గా టీమ్ బాధ్యతలను మోసిన అలీ.. ఇకపై ఎవరు చెప్పినా తన నిర్ణయంలో మార్పు ఉండదని పేర్కొన్నాడు. ఒకవేళ కెప్టెన్ స్టోక్స్ నుంచి మరోసారి ఇలాంటి ప్రతిపానలు వస్తే.. ఆ మెసేజ్ను డిలీట్ చేస్తానని అన్నాడు. ఇంగ్లండ్ ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడటంతో యాషెస్ సిరీస్ కు ముందు ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో రంగంలోకి దిగిన స్టోక్స్.. అలీని టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాడు. ఎన్నో విధాల నచ్చజెప్పిన అనంతరం మోయిన్ తిరిగి వైట్ జెర్సీలో మైదానంలో అడుగుపెట్టాడు. ఈ సిరీస్ లో టాపార్డర్ లో బ్యాటింగ్ చేయడంతో పాటు.. అవసరమైన సమయంలో బంతితో సత్తాచాటిన అలీ.. ఇకపై టెస్టు క్రికెట్ ఆడనని తెగేసి చెప్తున్నాడు.
చివరి టెస్టు అనంతరం అలీ మాట్లాడుతూ.. ‘గెలుపుతో సిరీస్ ముగించడం ఆనందంగా ఉంది. యాషెస్ ప్రారంభానికి ముందు తిరగి సుదీర్ఘ ఫార్మాట్ ఆడమని స్టోక్స్ కోరితే కుదరదనే చెప్పా. ఆసీస్ పై నా రికార్డు అంతా మెరుగ్గా లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. అయితే స్టోక్స్ నా మాట వినలేదు. పట్టుబట్టి నన్ను రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా ప్రోత్సహించాడు. దీంతో తిరిగి వచ్చాను. ఈ సిరీస్ ను చాలా ఆస్వాదించా, బ్రాడ్, అండర్స్ తో కలిసి మరోసారి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను కెరీర ప్రారంభించినప్పుడు కూడా ఈ ఇద్దరూ జట్టులో ఉన్నారు’ అని అన్నాడు.
పొట్టి ఫార్మాట్ లో విధ్వంసకర బ్యాటర్ గా గుర్తింపు తచ్చుకున్న అలీ.. ఈ సిరీస్ లో బ్యాట్ తో 180 పరుగులు చేయడంతో పాటు.. బంతితో 9 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మోయిన్ బంతిని గింగిరాలు తిప్పాడు. కంగారూ ప్లేయర్లు కదురుకున్న దశలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చేతికి గాయమైనా లెక్కచేయని ఈ ఆల్ రౌండర్ సిరీస్ లో మొత్తం నాలుగు మ్యాచ్ లు ఆడాడు. ఇంగ్లిష్ జట్టు టాపార్డర్ లో ఎక్కువ మంది రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో.. లెఫ్ట్ హ్యాండర్ అయిన మోయిన్ అలీని టీమ్ మేనేజ్ మెంట్ మూడో స్థానంలో బరిలోకి దింపి ఫలితాలు రాబట్టింది.