మన దేశంలో క్రికెట్ ని ఓ మతంలా, క్రికెటర్లని దేవుళ్ల కంటే ఎక్కువగా పూజిస్తారు. దేశంలో ఎన్నో ఆటలు ఉన్నప్పటికీ.. క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ మరో గేమ్ కి ఉండదు. ఇక క్రికెటర్లని కలిసేందుకు ఎంతకైనా సరే తెగించే అభిమానులు చాలామంది ఉన్నారు. ఇప్పటికే మ్యాచ్ జరుగుతుంటే మైదానంలోకి దూసుకెళ్లడం, క్రికెటర్ల పాదాలకు నమస్కారం చేయడం లాంటివి ఇప్పటికే చాలాసార్లు చూశాం. ఇప్పుడు అంతకు మించిన సాహసం చేశాడో అభిమాని. తన అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో చూపించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇండియన్ క్రికెట్ అనగానే జనరేషన్ కి ఓ క్రికెటర్ గుర్తొస్తారు. కపిల్ దేవ్, సచిన్, ధోనీ.. ఇక ప్రస్తుత జనరేషన్ తీసుకుంటే విరాట్ కోహ్లీ. ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పి, 71 సెంచరీలు చేసిన కోహ్లీ.. రాబోయే రోజుల్లో మరిన్ని సాధిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే విరాట్ అంటే అభిమానించే వాళ్లు చాలామంది. ఈ క్రమంలోనే ఓ ఫ్యాన్ చేసిన పని.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.కింగ్ కోహ్లీతో కేవలం సెల్ఫీ దిగేందుకు అసోం గౌహతికి చెందిన రాహుల్ రాయ్.. ఏకంగా రూ.23 వేలు ఖర్చు పెట్టాడు. విషయం ఏంటంటే.. రెండో టీ20 కోసం టీమిండియా గౌహతి చేరుకుంది. ఈ నేపథ్యంలో కోహ్లీని కలిసేందుకు రాహుల్, విమానశ్రయానికి వెళ్లాడు. సెక్యురిటీ గార్డ్, రాహుల్ ని కోహ్లీ దగ్గరకు వెళ్లనివ్వలేదు.
దీంతో డిసప్పాయింట్ అయిన రాహుల్.. టీమిండియా బస చేసిన హోటల్ లో రూమ్ బుక్ చేసుకోవాలని ఫిక్సయ్యాడు. మరి టీమిండియా జట్టు ఉందంటే.. ఆ హోటల్ లో రూమ్ ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది కదా. అయినా సరే డబ్బు గురించి ఆలోచించకుండా కోహ్లీని కలవాలని రాహుల్ బలంగా నిర్ణయించుకున్నాడు. అదే హోటల్ లో ఏకంగా రూ.23,400 పెట్టి రూమ్ బుక్ చేసుకున్నాడు. ఇక రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ లాంజ్ లో విరాట్ తో సెల్ఫీ దిగి తన ముచ్చట తీర్చుకున్నాడు. ఇక కోహ్లీతో ఫొటో దిగడమే కాకుండా అతడి ఫొటోపై ఆటోగ్రాఫ్ తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ అభిమానం చూసి నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కోహ్లీ ఫ్యాన్ చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.