ఆస్ట్రేలియాతో టెస్టులో కోహ్లీ సెంచరీ చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ఫార్మాట్ లో విరాట్ శతకం కొట్టడం ఏమో గానీ వార్నర్ దీనిపై పోస్ట్ పెట్టడం మాత్రం చాలా ఆసక్తిగా అనిపించింది. ఇంతకీ వార్నర్ ఏం రాసుకొచ్చాడు?
విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. దాదాపు మూడన్నరేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ చేశాడు. తన పని అయిపోయింది అని ట్రోల్ చేసిన విమర్శకుల నోళ్లు మూయించేశాడు. అయితే కోహ్లీ సెంచరీ కొట్టడం గ్రేట్ కాదు. గత ఆరు నెలల్లో 5 సెంచరీలు చేసిన కోహ్లీ.. ఏకంగా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా నాలుగో టెస్టులో కోహ్లీ బ్యాట్ తీసుకుని మరీ స్మిత్ పరీక్షించిన విజువల్స్, ఫొటోలు మీరు ఇప్పటికే చూశారు. ఇప్పుడు ఆసీస్ జట్టులోని స్టార్ ఓపెనర్ వార్నర్.. కోహ్లీ సెంచరీపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ అంటే ఒకప్పుడు ఎవరు ఎవరు గొడవపడతారు? అని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేసేవారు. అందుకు తగ్గట్లే క్రికెటర్లు కూడా పోటిపడి మరీ స్లెడ్జింగ్ చేస్తూ రెచ్చిపోయేవారు. కానీ ఐపీఎల్ పుణ్యమా అని పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. క్రికెటర్ల మధ్య బాండింగ్ పెరిగిపోయింది. అలా ఆసీస్ క్రికెటర్ వార్నర్.. టీమిండియా ఫ్యాన్స్ కు, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లకు ఫేవరెట్ అయిపోయాడు. సందర్భం వచ్చిన ప్రతిసారి తన మనసులో ఏం పెట్టుకోకుండా బయటపెడుతుంటాడు. అలానే ఇప్పుడు కోహ్లీ సెంచరీ చేసింది తను ఆడుతున్న జట్టుపైనే అయినా పోస్ట్ పెట్టకుండా ఉండలేకపోయాడు.
విరాట్ కోహ్లీ అంటే పాత జనరేషన్ ఆటగాళ్లతోపాటు ఇప్పటితరం ప్లేయర్లలోనూ చాలామందికి ఫేవరెట్. అందులో వార్నర్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. వార్నర్ తోపాటు అతడి కూతురికి కూడా కోహ్లీ అంటే చాలా ఇష్టం. మరోవైపు ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ.. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఈ ఫార్మాట్ లో మూడంకెల స్కోరు చేశాడు. దీంతో వార్నర్ కోహ్లీ ఫొటో పోస్ట్ చేసి.. ‘ఛాంపియన్స్ కు తిరుగులేదని వాళ్లు చెప్పారు’ అని రాసుకొచ్చాడు. ఇది చూసిన చాలామంది నెటిజన్స్.. ‘వార్నర్ మావ.. నువ్వు అర్జంట్ గా మా దేశానికి వచ్చేయ్’ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వార్నర్ పోస్టుపై మీమ్స్ కూడా వైరల్ అవుతుండటం విశేషం.