రన్నింగ్ మెషిన్, కింగ్ కోహ్లీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. కేవలం ఆటగాడిగా మాత్రమే టీమ్ లో కొనసాగనున్నాడు. అయితే కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పలువురి పేర్లు వినిపిస్తున్నా కూడా దానిపై అధికారిక ప్రకటన వచ్చేందుకు సమయం పట్టేలా ఉంది. కోహ్లీ నిర్ణయంపై సర్వత్రా చర్చ నడుస్తున్న మాట వాస్తవమే. ఇదే అంశంపై టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ కూడా స్పందిచాడు.
కోహ్లీ పరిస్థితిపై మాట్లాడుతూ కపిల్ దేవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘టీ20 కెప్టెన్సీ పగ్గాలు వదిలనప్పటి నుంచి కోహ్లీకి గడ్డుకాలం నడుస్తున్న మాట వాస్తవమే. తాను ప్రస్తుతం బాగా ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ గా టీమిండియాకు కోహ్లీ ఎంతగానో కృషి చేశాడు. కానీ, ప్రస్తుతం కోహ్లీ యువ ఆటగాళ్ల సారధ్యంలో ఆడాల్సిన పరిస్థితి ఉంది. అందుకు కోహ్లీ ఎలాంటి ఇగోకు పోకూడదు. నేను కూడా అలా ఆడిన వాడినే. ఒక బ్యాట్స్ మన్ గా స్వేచ్ఛగా ఆడేందుకు కెప్టెన్సీని వదులుకోవడం సరైన నిర్ణయమే. నేను కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతిస్తాను. ఒక బ్యాటర్ గా కోహ్లీ సేవలను కోల్పోవడం అంటే టీమిండియాకు తీర్చలేని లోటు అవుతుంది.
సునీల్ గవాస్కర్ నా సారధ్యంలో ఆడాడు. నేను శ్రీకాంత్, అజహరుద్దీన్ సారధ్యంలో ఆడాను. నేను ఎప్పుడూ నామూషీగా ఫీల్ అవ్వలేదు. కోహ్లీ టీమిండియా కోసం తన ఇగోను వదిలేసి ఆడాల్సి ఉంటుంది. యంగ్ ప్లేయర్లకు తను దిశానిర్దేశం చేయాలి. కోహ్లీ కూడా తన అహాన్ని పక్కన పెట్టి టీమిండియా కోసం కృషి చేయాలి. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించే ఉంటాడు. బ్యాటర్ గా మాత్రం కోహ్లీని కోల్పోలేం.. తను ఆడాల్సి ఉంటుంది’ అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. కపిల్ దేవ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Virat Kohli (@imVkohli) January 15, 2022