ఆస్ట్రేలియాను టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిపిన కోచ్ జస్టిన్ లంగర్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారులతో అనేక చర్చల అనంతరం.. లంగర్ తన పదవి నుంచి వైదొలిగినట్లు అతడి మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎస్‌ఈజీ శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఆసీస్ క్రికెట్ బోర్డుతో కుదిరిన ఒప్పందం ప్రకారం లంగర్ జూన్ వరకు తన పదవికాలం ఉన్నా.. ఆయన రాజీనామా చేశారు. దీంతో ఆయన రాజీనామా ఎందుకు చేశారనే విషయంపై తీవ్ర చర్చ నడుస్తుంది.
ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్, ప్రస్తుత టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సహా పలువురు కీలక ఆటగాళ్లతో లంగర్‌కు అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆటగాళ్లతో విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటాడని, అంతా తాను చెప్పినట్లే జరగాలనే నియంతృత్వ ధోరణితో ఉంటాడని ఆటగాళ్లు అతడి వ్యవహారశైలిపై బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.
ఆయనతో తమకు కుదరడంలేదని కోచ్‌కు వ్యతిరేకంగా ఆటగాళ్లు గళం విప్పడంతో ఆయనను కొనసాగించేందుకు బోర్డు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ లంగర్‌కు మద్ధతుగా నిలిచాడు. అతను కోచ్ పదవి నుంచి తప్పుకోవడం విచారకరమన్నాడు. మరి ఆసీస్ హెడ్ కోచ్‌గా లంగర్ తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.