కొన్ని రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ దారుణంగా మోసపోయిన సంగతి తెలిసిందే. ఉమేష్ యాదవ్ స్నేహితుడే అతడిని ఓ ఫ్లాట్ విషయంలో మోసం చేశాడు. ఉమేష్ యాదవ్ తన మేనేజర్‌గా స్నేహితుడు శైలేష్ థాకరేను నియమించుకోగా.. అతడు ఓ ఫ్లాట్ విషయంలో ఉమేష్ యాదవ్‌ను మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్ భార్య ఇలా మోసపోయిన వారి జాబితాలో చేరింది. వ్యాపారం పేరు చెప్పి ఇద్దరు హైదరాబాదీలు.. టీమిండియా క్రికెటర్ భార్యను ఏకంగా 10 లక్షల రూపాయలకు మోసం చేశారు. ఆ వివరాలు..
ప్రముఖ టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ భార్య.. జయా భరద్వాజ్ హైదారాబాదీల చేతిలో మోసపోయింది. బిజినెస్ వెంచర్ పేరు చెప్పి ఏకంగా 10 లక్షల రూపాయలు మోసం చేశారు నిందితులు. దాంతో దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర చాహర్ ఆగ్రాలోని హరి పర్వత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ధ్రువ్, కమలేష్ పరీక్ అనే ఇద్దరు వ్యక్తుల మీద లోకేంద్ర చాహర్ ఫిర్యాదు చేశాడు. నిందితులిద్దరిలో ఒకరు గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అధికారి అని తెలుస్తోంది.
వీరిద్దరూ 2022, అక్టోబర్ 7.. బిజినెస్ వెంచర్ పేరు చెప్పి.. జయా భరద్వాజ్ వద్ద నుంచి 10 లక్షల రూపాయలు కాజేసి పరారయినట్లు లోకేంద్ర చాహర్ ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించాడు. ఆ తర్వాత నిందితులకు కాల్ చేసి డబ్బులు తిరిగి ఇవ్వమంటే.. తిట్టడమే కాక.. బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చాహర్ తండ్రి వెల్లడించాడు. లోకేంద్ర చాహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ధ్రువ్, కమలేష్ పరీక్ మీద కేసు నమోదు చేసి.. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇక దీపక్ చాహర్, జయా భరద్వాజ్‌లకు 2022, జూన్ 2 ఆగ్రాలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. చాహర్.. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్‌లో స్టార్ ప్లేయర్. ఇక 2021, అక్టోబర్ 7 పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్ గెలిచిన అనంతరం దీపక్ చాలా రొమాంటిక్ వేలో జయా భరద్వాజ్‌కు ప్రపోజ్ చేశాడు. కొన్ని నెలల తర్వాత వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మరి క్రికెటర్లు కూడా ఇలా మోసపోతుండటం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.