టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రన్ మెషీన్ అనే ఒక అరుదైన బిరుదు ఉంది. కానీ.. ప్రస్తుతం కోహ్లీ ఉన్న పరిస్థితుల్లో రన్ మెషీన్ అని కోహ్లీని పిలిచేందుకు అతని ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకు కారణం దాదాపు మూడేళ్ల నుంచి కోహ్లీ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడకపోవడమే. మంచి నీళ్లప్రాయంలా సెంచరీలు మీద సెంచరీలు కొట్టిన కోహ్లీ.. ఇప్పుడు పరుగులు చేయడానికే ఇబ్బంది పడుతున్నాడు.
టన్నుల కొద్ది పరుగులు చేస్తూ.. ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. కానీ.. ఇప్పుడు జట్టులో చోటే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో కోహ్లీ ఫామ్ గురించే చర్చ. నిజానికి కోహ్లీపై విమర్శల కంటే కూడా.. అతను మళ్లీ తన స్థాయికి తగ్గట్లు ఆడి సెంచరీ చేస్తే చూడాలనే ఆశే అందరిలో కనిపిస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ పరుగులు చేయకుండా ఇబ్బంది పడిన క్షణాలను అతని ఫ్యాన్స్ కానీ, క్రికెట్ అభిమానులు కానీ చూడలేదు.
కొన్ని ఏళ్లపాటు ఇండియన్ క్రికెట్‌ను ఏలిన కోహ్లీ.. ఇప్పుడు గడ్డుపరిస్థితి ఎదుర్కొవడం చూసి అతని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఒకింత ఆవేదన చెందుతున్నారు. కొంతమంది కింగ్ కోహ్లీ కమ్‌బ్యాక్ ఇస్తాడంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే.. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్ కోహ్లీకి డైరెక్ట్‌గా హెల్ప్ చేసేందుకు సైతం ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాడ్‌ఫేజ్‌పై విచారం వ్యక్తం చేసిన గవాస్కర్.. 20 నిమిషాలు కోహ్లీతో కలిసి మాట్లాడితే అతని సమస్యను పరిష్కరించగలనని నమ్ముతున్నట్లు వెల్లడించారు.
కోహ్లీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లలో అతను అవుట్ అయిన ప్రతి బంతి అద్భుతమైన బంతే అని అన్నాడు. ఆ బంతులను ఎంతటి గొప్ప బ్యాటర్ అయిన ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడతాడని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా.. కోహ్లీ ప్రస్తుతం పరుగులు చేయలేకపోతున్నాడు కనుక..ప్రతి బంతిని ఆడాలనే తాపత్రయంతో ఆడుతుండడం వలనే కోహ్లీ రన్స్ చేయలేకపోతున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే కోహ్లీ ఫామ్‌లోకి రావడం పెద్ద విషయం కాదని అన్నాడు. కాగా ప్రస్తుతం కోహ్లీకి వెస్టిండీస్ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. ఆ తర్వాత ఆసియా కప్‌లో కోహ్లీ జట్టులో చేరుతాడని సెలెక్టర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. మరి ఈ ఖాళీ సమయంలో గవాస్కర్ కోరినట్లు ఆ 20 నిమిషాలు కోహ్లీ ఇస్తే మంచిదే కానీ.. బహుషా అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sunil Gavaskar on Virat Kohli’s struggle with the bat. pic.twitter.com/dveETxBQ8m
— CricketTimes.com (@CricketTimesHQ) July 19, 2022