ప్రపంచ క్రికెట్లో ఎందరో దిగ్గజాలు వస్తూంటారు.. పోతుంటారు.. కానీ అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. అలా భారత క్రికెట్ అభిమానుల్లో నిలిచిపోయాడు మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా చిరకాల స్వప్నం అయిన ప్రపంచ కప్ ను 2011లో భారత్ అందించాడు. దాంతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ లో ఆటం బాంబులా పేలాడు. ఇక యువ ఆటగాళ్లను సాన పట్టడంలో తనకు తనే సాటిగా పేరుగాంచాడు ధోని. మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడో.. ప్రత్యర్థిని అంత ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న మిస్టర్ కూల్ కు విద్యార్థుల నుంచి పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురైయ్యయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ లో అతడో సంచలనం. మైదానంలో ఎంతో కూల్ గా ఉంటాడని అతడికి పేరుంది. మ్యాచ్ లో ఎంత ఒత్తిడి ఉన్నాగానీ.. ఆ ఒత్తిడి మాత్రం అతడి ఫేస్ లో కనిపించదు. ఇప్పడు ఇదే ప్రశ్నని మిస్టర్ కూల్ కి ఎదురైంది. తాజాగా లైవ్ ఫాస్ట్ అనే కంపెనీ కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ధోని.. విద్యార్ధులతో ముచ్చటించాడు. అయితే ఓ విద్యార్థి మీకు మైదానంలో కోపం రాదా? అని ప్రశ్నించగా దానికి ధోని ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.”చాలా మంది నాకు కోపం రాదు అనుకుంటారు. కానీ నాకూ కోపం వస్తుంది.. ఎందుకంటే నేనూ మనిషినే కాబట్టి. కాకపోతే నేను నా భావోద్వేగాలను నియంత్రించుకుంటాను.. కాబట్టే నేను మీకు చాలా ప్రశాంతంగా కనిపిస్తాను. మేము మైదానంలో ఉన్నప్పుడు క్యాచ్ లను పట్టుకోవాలనే అనుకుంటాం. కానీ కొన్ని సందర్బాల్లో ఒత్తిడి వల్ల అవి జారిపోతూంటాయి. అంత మాత్రానా అతడిని చెడ్డ ఫీల్డర్ అని ముద్ర వేయకూడదు. నేను అతడి స్థానంలో ఉండి ఆలోచిస్తాను.. కాబట్టే నేను మైదానంలో తొటి ప్లేయర్లపై అస్సలు కోప్పడను” అని వివరించాడు.
మరిన్ని విషయాలు పంచుకుంటూ.. “అతడి పై కోపం పెంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. మమ్మల్ని స్టేడియంలో కొన్ని వేల మంది చూస్తూంటారు.. ఇక టీవీల్లో అయితే కొన్ని లక్షల మంది చూస్తారు. కాబట్టి మనం ఎంత ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తే జట్టుకు అంత మంచి జరుగుతుంది. ఆటగాళ్లు కావాలని మిస్ ఫీల్డింగ్ చేయరు కదా? ఇక కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇతర ప్లేయర్లపై కోపాన్ని ప్రదర్శించరాదు” అని పేర్కొన్నాడు. నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. అని నిరంతరం గుర్తు చేసుకుంటాను. ఆ కారణంగా నేను మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాను. అదీకాక మైదానంలో ఏ ఆటగాడైనా తప్పు చేస్తే మ్యాచ్ తర్వాత గ్యారంటీగా ఆ తప్పుకు గల కారణాలను విశ్లేషిస్తాను” అని వెల్లడించాడు. విద్యార్థులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు ధోని సరదాగా బదులిస్తూ.. వచ్చాడు. మరి తొలి సారిగా మైదానంలో తాను ప్రశాంతగా ఎలా ఉంటాడో వివరించిన ధోని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.