విరాట్ కోహ్లీకి ప్రస్తుతం క్రికెట్ పరంగా గడ్డుకాలం నడుస్తున్న విషయం తెలిసిందే. పరుగుల యంత్రందా పేరు గాంచిన కింగ్ కోహ్లీని ప్రస్తుతం డకౌట్లు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కోహ్లీ కెరీర్‌లో కాస్త బ్రేక్ తీసుకోవాలంటూ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం వ్యాఖ్యానించడం చూశాం. అయితే ఇప్పుడు టీమిండియా వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఓ వార్త కోహ్లీ ఫ్యాన్స్ కు భారీ షాకే ఇస్తుందని చెప్పాలి. రాబోయే దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్ లకు కోహ్లీ దూరంగా ఉంటాడని ఇప్పటికే తెలిసింది. ఆ రెండు సిరీస్ లకు కోహ్లీకి సెలక్షన్ కమిటీ విశ్రాంతి ప్రకటించనుంది. టీమ్ ను ప్రకటించే ముందు కోహ్లీతో సెలక్షన్ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది. అయితే అవన్నీ నామమాత్రపు సంప్రదింపులేనని.. ఇప్పటికే కమిటీ ఓ నిర్ణయం తీసుకుందని బీసీసీఐ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. అయితే విశ్రాంతి ఇవ్వడంపై పలు అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇదీ చదవండి: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న పుజారా.. వరుసగా నాలుగో సెంచరీ
ఒక టాప్ ప్లేయర్ ఫామ్ లేమితో సతమతమవుతున్న సందర్భంలో సెలక్షన్ కమిటీ సాధారణంగానే కొంత విశ్రాంతినిస్తుంది. అలా విశ్రాంతి ఇచ్చేందుకు కూడా ఓసారి ఆ ప్లేయర్ అభిమతాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం అది నామమాత్రంగానే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా టెస్టు జట్టు నుంచి ఎలాగైతే రహానే, పుజారాను తప్పించారో అదే ఫార్ములాను ఇప్పుడు కోహ్లీపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దానిని కొట్టిపారేసే పరిస్థితి కూడా లేదనే వాదన నిపుణుల నుంచి వినిపిస్తోంది. జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్- దక్షిణాఫ్రికా 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ కు సంబంధించి తుది జట్టును మే నెల చివరికి విడుదల చేసే అవకాశం ఉంది. తొలి టీ20 జూన్ 9న ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఐదో టీ20 జూన్ 19న బెంగళూరు వేదికగా జరగనుంది.
ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ విషయానికి వస్తే కోహ్లీ ఫామ్ చాలా దారుణంగా కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ లలో కోహ్లీ కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో 41 నాటౌట్ అత్యధిక స్కోరుగా ఉంది. అయితే మొత్తం 12 మ్యాచ్ లలో కోహ్లీ మూడుసార్లు డకౌట్ గా పెవిలియన్ చేరాడు. 12 మ్యాచ్‌లలో పర్ఫార్మెన్స్ చూసుకుంటే.. 41*, 12, 5, 48, 1, 12, 0, 0, 9, 58, 30, 0.. స్కోరుతో విమర్శలకు కోహ్లీనే స్వయంగా తావిచ్చినట్లైంది. ఇప్పుడు అదే ప్రదర్శనను సాకుగా చూపించి సెలక్టర్లు సైంతం వేటు వేసేందుకు సిద్ధపడుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే టీ20 వరల్డ్ కప్ కి సైతం కోహ్లీ అందుబాటులో ఉండడా అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. కోహ్లీపై వేటు వేసేందుకే విశ్రాంతి ఇస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
