ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కప్పు కొట్టాలని తహతహలాడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ సారి దానికోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుంది. ఆ దిశగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి సీజన్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగడం.. చివరకు కప్పు చేజిక్కించుకోకుండానే వెనుదిరగడం ఇది బెంగళూరుకు అలవాటై పోయింది. దిగ్గజ ఆటగాళ్లు ఎందరున్నా.. లీగ్ లో బెంగళూరు బెంగ మాత్రం తీరడం లేదు. ఇప్పటి వరకు 16 సీజన్లు ముగియగా.. వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఆర్సీబీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. సపోర్ట్ స్టాఫ్ ను మార్చుతోంది. చాన్నాళ్లుగా టీమ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్న మైక్ హెస్సెన్ కు వీడ్కోలు పలికింది. అతడితో పాటు బ్యాటింగ్, హెడ్ కోచ్గా సేవలందించిన సంజయ్ బంగర్ కు గుడ్ బై చెప్పింది. కొత్త కోచ్ గా జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్ ను నియమించింది.
అంతర్జాతీయ క్రికెట్ లో అపార అనుభవం ఉన్న ఆండీ ఫ్లవర్ కు కోచ్ గానూ మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. తాజా సీజన్ వరకు అతడు ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కు హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది లక్నో జట్టు నుంచి దూరం కావడంతో ఆర్సీబీ అతడికి తమ జట్టు బాధ్యతలు అప్పగించింది. గతంలో ఇంగ్లండ్ జట్టును టీ20 ప్రపంచకప్ విజేతగా నిలుపడం వెనుక ఫ్లవర్ క్రుషి ఎంతో ఉంది. సుదీర్ఘ క్రికెట్ చరిత్ర ఉన్న ఇంగ్లండ్ జట్టు ను తొలిసారి ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత ఫ్లవర్ కే దక్కుతుంది. దీంతో పాటు.. అతడు ఇంగ్లిష్ టీమ్ కు యాషెస్ సిరీస్ కూడా సాధించిపెట్టాడు.
ఆండీ ఫ్లవర్ తో ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని.. ఆర్సీబీ సోషల్ మీడియాలో పేర్కొంది. ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యుడు, దిగ్గజ కోచ్ తో కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉంది. టీ20 ఫార్మాట్ తో పాటు ఐపీఎల్లో అపార కోచింగ్ అనుభవం ఉన్న ఫ్లవర్ రాకతో జట్టుకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. అతడితో పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నాం. అతడి అనుభవం మాకెంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని ట్వీట్ చేసింది.కేవలం ఐపీఎల్లోనే కాక కరీబియన్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ది హండ్రెడ్, అబుదాబి టీ10 లీగ్, ఇంటర్నేషనల్ లీగ్ 20 వంటి పలు లీగ్ ల్లో తాను శిక్షణ ఇచ్చిన జట్లకు ఫ్లవర్ చాంపియన్ గా నిలిపాడు. మరి కోచ్ మారితే అయినా.. ఆర్సీబీ రాత మారుతుందా వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.