ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ ఓ దిగ్గజం. క్రికెట్ ఒక పర్వత ప్రాంతమైతే అందులో సచిన్ ఎవరెస్ట్ శిఖరం. ఇండియాలో అయితే అతనే క్రికెట్ గాడ్. భారత్‌లో క్రికెట్ బ్రతికున్నంత కాలం.. గుర్తుండిపోయే పేరు సచిన్. అతను సాధించిన రికార్డులు అనితరసాధ్యం.. అతను ఆడిన తీరు వర్ధమాన క్రికెటర్లకు ఒక గ్రంథం. అలాంటి ఆటగాడు బ్యాట్ పట్టి మైదానంలో విలయతాండవం చేస్తుంటే.. ప్రపంచంలోని ప్రతి క్రికెట్ అభిమాని ఆస్వాదించకమానడు. అభిమానులే కాదు.. అతనితో కలిసి ఆడిన తోటి క్రికెటర్లు, ఇప్పటి స్టార్ క్రికెటర్లతో పాటు.. అతని కంటే ముందు ఇండియన్ క్రికెట్‌ను ఏలిన లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ సైతం సచిన్ బ్యాటింగ్‌కు వీరాభిమాని.
ఆ విషయాన్ని గవాస్కర్ ఎన్నో సార్లు వెల్లడించారు. సచిన్ ఆడుతుంటే.. చూడటానికి తానెంతో ఇష్టపడతానని సచిన్‌పై తన అభిమానాన్ని వ్యక్తం పరిచారు. సచిన్ కంటే ఎంతో సీనియర్ అయిన గవాస్కర్ కూడా ఇండియన్ క్రికెటర్లలో ఒక లెజెండ్ అలాంటి వ్యక్తి కూడా సచిన్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారంటే.. సచిన్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే.. సచిన్ తర్వాత తనను అంతలా ఎగ్జైట్ చేసిన ఆటగాడు ఒకడున్నాడంటూ గవాస్కర్ ఆసక్తికర స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘సచిన్ తర్వాత.. ఇండియాకు ఉమ్రాక్ మాలిక్ ఆడటాన్ని చూసేందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నా’ అంటూ తెలిపారు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో అత్యధిక వేగంగా బౌలింగ్ వేస్తున్న బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ రికార్డులకెక్కాడు.
ఇప్పుడే కాదు.. గతంలో ఏ ఇండియన్ బౌలర్ కూడా వేయని స్పీడ్‌ను ఉమ్రాన్ మాలిక్ వేస్తున్నాడు. గంటకు దాదాపు 156 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ వేయగల సత్తా ఉమ్రాన్ సొంతం. ఇలాంటి ప్లేయర్‌ను ఆస్ట్రేలియా లాంటి స్పీడ్ పిచ్‌లపై జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇండియన్ మాజీ క్రికెటర్లే కాకుండా.. విదేశీ మాజీ క్రికెటర్లు సైతం ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేయకపోడాన్ని తప్పుబట్టారు. అయితే.. వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌కు ఉమ్రాన్ ఎంపిక చేయగా.. అక్కడ సత్తా చాటాడు. అలాగే.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు సైతం ఉమ్రాన్‌ను ఎంపిక చేయగా.. తన స్పీడ్‌తో బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. టీమిండియా వరుస పరాజయాలు చవిచూస్తున్నా.. ఉమ్రాన్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో అవకాశం రాకున్నా.. రెండో వన్డేలో రెండు వికెట్లతో అదరగొట్టాడు.
Sunil Gavaskar said “After Sachin, one player I am most excited to see playing for India is Umran Malik”.
— Johns. (@CricCrazyJohns) December 9, 2022