ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏ లీగ్ లు జరిగినాగానీ అభిమానులు వేలల్లో మైదానాలకు పొటెత్తుతారు. అలాంటి క్రికెట్ రాబోయే రోజుల్లో సమస్యల్లో చిక్కుకోబోతోంది అని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజం, మాజీ ఆటగాడు, మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకు వీడ్కోలు తీసుకోవడంపై ఎదురైన ప్రశ్నకు స్పందించాడు ఏబీడి. ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ లు రావడంతో ప్లేయర్స్ ఫార్మాట్లను ఎంపిక చేసుకోవడంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
ఏబీ డివిల్లియర్స్.. పేరుకే దక్షిణాఫ్రికా ఆటగాడు అయినప్పటికీ భారతీయులతో పాటుగా ప్రపంచ క్రికెట్ అభిమానులకు దగ్గరివాడు. గ్రౌండ్ లో నలువైపులా.. ఏ బ్యాటర్ కొట్టలేని విధంగా షాట్స్ కొట్టడంలో ఏబీడి సిద్దహస్తుడు. అందుకే అతడిని అభిమానులు ముద్దుగా మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ గా పిలుసుకుంటారు. ఇక 2018లోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ స్టార్ బ్యాటర్.. గతేడాది లీగ్ లకూ గుడ్ బై చెప్పేశాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏబీడి ప్రపంచ క్రికెట్ సమస్యల్లో ఉందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ సందర్భంగా బెన్ స్టోక్స్ వన్డే రిటైర్మెంట్ గురించి డివిల్లియర్స్ తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..”విపరీతమైన బిజీ షెడ్యూల్స్ తో ప్లేయర్లు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య వరల్డ్ వైడ్ క్రికెట్ లో ఉంది. పైగా ప్రస్తుత కాలంలో టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. దాంతో ప్లేయర్స్ అటువైపు దృష్టి పెడుతున్నారు. అయితే బిజీ షెడ్యూల్స్ కారణంగా కొంత మంది ప్లేయర్స్ తన కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నారు. అందుకే ఓ ఆటగాడు ఏ ఫార్మాట్ కు సరిపోతాడు? ఏం సాధించాలి అనుకుంటున్నాడు? అన్న విషయాలు ముందుగానే తెలిసి ఉండాలి” అని ఏబీడి చెప్పుకొచ్చాడు.
ఇక ఈ లీగ్ ల్లో ఆడితే వచ్చే అనుభవం మెగా టోర్నీల్లో అద్భుతంగా సాయపడుతుందని డివిల్లియర్స్ పేర్కొన్నాడు. నాతోపాటుగా సూర్యకుమార్, డెవాల్ట్ బ్రెవిస్ లాంటి ఎంతో మంది క్రికెటర్లు లీగ్ ల ద్వారానే రాణించారని ఏబీడి గుర్తు చేశాడు. అయితే దేశం తరపున అన్ని ఫార్మాట్లలో ఆడే విధంగా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన బాధ్యత ఆయా దేశాల క్రికెట్ బోర్డులపైనే ఉందని ఏబీడి అభిప్రాయం వ్యక్తం చేశాడు. బిజీ షెడ్యూలింగ్ రాబోయే రోజుల్లో ప్రపంచ క్రికెట్ కు ఓ పెను సవాల్ గా మారబోతుంది అని ఏబీడి పేర్కొన్నాడు. మరి డివిల్లియర్స్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.