ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచే సభను అడ్డుకోవడానికి ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. సభలో చర్చ జరగనీయకుండా.. మాటికి మాటికి అడ్డుపడ్డారు టీడీపీ నేతలు. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి సభ సజావుగా సాగకుండ చేశారు. ప్రశ్నోత్తారల తర్వాత చర్చిద్దామని స్పీకర్ తమ్మినేని హామీ ఇచ్చినా.. టీడీపీ నేతలు ఊరుకోలేదు. అనంతరం స్వీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. దీనిలో అధికార పార్టీ నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు.. ఇతర సభ్యులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేష్ తదితరులు పాల్గొనగా.. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ క్రమంలో బీఏసీ సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు సీఎం జగన్.
విపక్షాలు డిమాండ్ చేసే ఏ అంశంపై అయినా తాము చర్చకు సిద్ధమని సీఎం జగన్ స్పష్టం చేశారు. అచ్చెన్నకు బంపరాఫర్ ఇస్తూ.. అవసరమైతే ESI స్కామ్‌పై కూడా చర్చిద్దామని పంచ్ వేశారు సీఎం జగన్. అంతేకాక టీడీపీ నేతలు ఏం అడిగితే దానిపై చర్చకు సిద్ధమని తెలిపారు. అంతేకాక ‘‘మీరు ఒకటి అంటే మావాళ్లు పది అనగలరు’’ అని సీఎం జగన్ హెచ్చరించారు. అలానే టీడీపీ సభ్యులు కోరితే.. రాజధాని అంశంపైనా కూడా చర్చ పెడతామన్నారు. కానీ సభకు వచ్చి గౌరవంగా వ్యవహరించాలని సూచించారు సీఎం జగన్.
ఇక టీడీపీ సభ్యుల తీరుపై బీఏసీలో వైసీపీ మంత్రుల అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చకు సహకరించకుండా గొడవ చెయ్యడం కరెక్ట్ కాదని మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రిని అంటే ఊరుకునేది లేదని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జోగి రమేష్ స్పష్టం చేశారు. అలానే ఐదు రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 21 వరకు సభ కొనసాగనుండగా.. శని, ఆదివారాలు సెలవు ఉండనుంది. మరి సీఎం జగన్ అచ్చెన్నాయుడికి ఇచ్చిన ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.